కొత్త ఎత్తులు
విజయనగరం కంటోన్మెంట్: రోజురోజుకూ సమస్యాత్మకంగా మారుతున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ భూ సేకరణ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు కొత్త దారులు వెతుకుతున్నారు. నిర్వాసిత గ్రామాల్లోకి అధికారులు వెళ్లడంతో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. కేసులు పెడతామని హెచ్చరించినా, సెక్షన్ 30ని అమలు పరచినా ఎయిర్‌పోర్టు బాధితులు వెరవకుండా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులను ఒప్పించేందుకు అడపా దడపా వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అసలు గ్రామాల్లోకి అడుగుపెట్టనీయడంలేదు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనితను బుధవారం సుమారు రెండు గంటల పాటు నిర్బంధించారు. ఎయిర్‌పోర్టు బాధితుల ఆగ్రహాన్ని చూసి ద్వితీయ శ్రేణి అధికారులు గ్రామాల్లోకి వెళ్లేందుకు
భయపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధికారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. గ్రామాల్లోకి ఎవరినీ రానీయడం లేదు కనుక నిర్వాసితులనే కలెక్టరేట్‌కు పిలిపించి చర్చించాలని నిర్ణయించారు. కలెక్టరే స్వయంగా నిర్వాసితులతో చర్చించేలా చర్యలు ప్రారంభించారు. భూములు, ఇళ్లు కోల్పోనున్నవారిని, పోరాట కమిటీ నాయకులను కలెక్టరేట్‌కు త్వరలోనే పిలిపించి దశలవారీగా చర్చించనున్నారు, ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన నిర్వాసితులు, నాయకులతో చర్చించి, విమానాశ్రయ అవసరాన్ని తెలియజెప్పి వారిని ఒప్పించేందుకు నిర్ణయించినట్టు భోగట్టా. మరో పక్క విమానాశ్రయం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. సేకరించాల్సిన 5,311.88 ఎకరాలను సర్వే చేసి, హద్దులు నిర్ణయించేందుకు ఈ నిధులు వెచ్చించాలని ఉత్తర్వులు వచ్చాయి.