prostitute houses
-
సెక్స్‌వర్కర్ల కుమార్తెలు బురదలో పూసిన పూలు
ఇక్కడ బురద అంటున్నది వేశ్యావాటికను కాదు. వేశ్యావాటికను బురద అనే దృష్టికోణమే తప్పు అంటారు ఆ అమ్మాయిలు. సమాజమే ఒక బురద కావచ్చు...అదే ఈ బురదను తయారు చేస్తుండవచ్చు అని కూడా అంటారు. వేశ్య కూతురు వేశ్య అవుతుందని నియమం. కాదు.. సమాజ పరివర్తన కార్యకర్త అవుతుందనినిరూపిస్తున్నారు ఈ ఆశాదీపాలు. ‘స్టాప్ జడ్జింగ్.. స్టార్ట్ ఇంక్లూడింగ్’... ‘తీర్పులు ఆపండి... మమ్మల్ని తోడు తీసుకోండి’ అని సాదరంగా స్నేహహస్తాన్ని చాపుతున్నారు. ముంబైలోని కామాటిపురా నుంచి కుర్లాకు నలభై నిమిషాల ప్రయాణం. కాని ఆ ప్రయాణం కొందరికి ఒక జీవితకాలంలో సంభవించకపోవచ్చు. కామాటిపురా నుంచి బయటపడి కుర్లాలోని ‘క్రాంతి’ ఎన్.జి.ఓకు చేరిన వారికి ఒక కొత్తప్రపంచం వీలవుతుంది. ‘క్రాంతి’ సంస్థ వేశ్యలకు పుట్టిన కుమార్తెలకు కొత్త జీవితం ఇవ్వడానికి పని చేస్తోంది. వారి కలలు సాకారం కావడానికి రెక్కలు ఇస్తోంది. ఎగిరి వెళ్లదలుచుకుంటే ఎంత దూరమైనా ఎగరనిస్తుంది. అప్పడాలు.. కుట్టుమిషన్లు... ‘2009లో నేను క్రాంతి సంస్థను ప్రారంభించే వరకు ముంబైలోని కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఎన్.జి.ఓలు వేశ్యల సంతానానికి కొత్త జీవితం ఇచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఆ జీవితం పరిమితమైనది. వారికి మహా అయితే అప్పడాలు తయారు చేయడం, కుట్టుపని నేర్పించడం చేసేవారు. తర్వాత వారి బతుకు ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్టుండేది. ఆ ఆడపిల్లలు ఏ కలలు కంటే ఆ కలలకు తోడు ఇవ్వాలి అని అనుకున్నాను’ అంటుంది రాబిన్చౌరాసియా. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ భారతీయురాలు అక్కడి మిలట్రీలో పని చేసి, అక్కడ లెస్బియన్ల పట్ల, గేల పట్ల ఉన్న వివక్షను వ్యతిరేకించి ఉద్యోగం మానేసింది. నేరుగా ఇండియాకు వచ్చి సెక్స్‌వర్కర్ల కుమార్తెల కోసం పని చేయడం మొదలెట్టింది. ముంబైలోని కుర్లాలో ఈమె స్థాపించిన సంస్థ తలుపులు 24 గంటలూ తెరిచి ఉంటాయి. ఏ సమయంలో అయినా ఏ వేశ్యావాటిక నుంచి అయినా ఏ అమ్మాయి అయినా ఇక్కడికి రావచ్చు. తల దాచుకోవచ్చు. కామాటిపురా సెక్స్ వర్కర్ల కుమార్తెలు ద్వేషం నుంచి ప్రేమకు ‘వేశ్యావాటికలో ఉన్నంత కాలం మా అమ్మను నేను ద్వేషించేదాన్ని. మా అమ్మ చేసే పని తప్పు అని నాకు అందరూ చెబుతుండేవారు. కాని క్రాంతి సంస్థలో చేరాక... ఆ పనిని మా అమ్మ కుటుంబం కోసం, నా కోసం చేసి ఉంటుందనే అవగాహన కలిగింది. మనల్ని మనం క్షమించుకోవడం, ఎదుటివారిని క్షమించగలగడం గొప్ప అవకాశం. అందుకే నేను మా అమ్మను ప్రేమించడం మొదలుపెట్టాను’ అంటుంది మెహక్ అనే ఒక వేశ్యకూతురు. క్రాంతికి చేరుకున్న ఇరవై ముప్పై మంది ఆడపిల్లల బాల్యం భయానకంగా ఉంది. ‘మా నాన్న ఎవరో నాకు తెలియదు. కాని వేరొకడు వచ్చి మా అమ్మను ఎప్పుడూ తంతుండేవాడు’ అని ఒకమ్మాయి చెప్తే ‘మా ఇంటికి వచ్చే ఒక మగాడు చిన్నపిల్ల అయిన నా రేటు అడుగుతుండేవాడు. మా అమ్మ వాణ్ణి బయటకు గెంటి నన్ను కాపాడుకుంటూ వచ్చింది’ అని మరో అమ్మాయి చెప్పింది. ‘నేను ఇంటి బయటివెలుతురు కూడా చూడలేదు. రోడ్డు దాటలేదు. బజారు తెలియదు. అయినా మా అమ్మ పడే హింస చూసి పదేళ్ల వయసులో పారిపోయాను. మూడేళ్లు రోడ్ల మీదే తిరిగి ఈ సంస్థకు చేరుకున్నాను’ అని ఒక అమ్మాయి చెప్పింది. సెక్స్‌వర్కర్ల జీవితాల్లో రెండో భర్తగా ప్రవేశించినవాళ్లు వారి కుమార్తెలకు నరకం చూపించడం చాలా మంది ఆడపిల్లల జీవితంలో ఉంది. కాని ఇంత బాధ అనుభవించినా సరే జీవితాన్ని కాంతివంతం చేసుకోవాలని కలలు కనడమే ఈ అమ్మాయిలు చేసిన, చేయగలుగుతున్న గొప్ప పని. సక్సెస్‌కు అర్థం ఏమిటి? ‘క్రాంతి సంస్థలో చేరిన ఆడపిల్లలకు చదువు ఉండదు. వారి ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు ఉండవు. వారు 13 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటారు. వారిని ఏ స్కూల్స్‌లోనూ చేర్పించలేము. కనుక మా దగ్గర ఒక స్కూల్ మొదలెట్టాము. ఇది అందరికీ సమానమైన స్కూలు కాదు. ఒక్కో అమ్మాయిని బట్టి ఆమెకు అవసరమయ్యే క్లాసులను డిజైన్ చేస్తాము’ అంటుంది రాబిన్ చౌరాసియా. ‘ఒక అమ్మాయిని ఏడో క్లాసు మూడుసార్లు కూచోబెట్టాము. మూడుసార్లు ఫెయిల్ అయ్యింది. నా మిత్రుడు చెప్పాడు– ఆ అమ్మాయికి రాని పని చెప్పి ఎందుకు ఫెయిల్ అయ్యాననే భావన కలిగిస్తావు. వచ్చిన పని నేర్పించి పాసయ్యానని అనుకోనివ్వొచ్చు కదా’ అని. ఈ ఫెయిల్ అయిన అమ్మాయి డ్రమ్స్ నేర్చుకుంది. ఇవాళ సంగీతం టీచరుగా చాలామంది పిల్లలకు సంతోషం పంచుతోంది. సక్సెస్‌కు నిజమైన అర్థం ఏమిటో నాకు తెలిసింది’ అంటుంది రాబిన్. క్రాంతిలో చేరిన ఆడపిల్లల్లో ఒక అమ్మాయి జుంబా డాన్సర్ అయ్యింది. ఒక అమ్మాయి యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఒక అమ్మాయి ఫ్లయిట్ అటెండెంట్ కావాలనుకుంటోంది. ఒక అమ్మాయి కామాటిపురాలో స్కూల్ తెరవాని అనుకుంటోంది. అందరు అమ్మాయిలు చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడటం నేర్చుకున్నారు. అన్నింటికి మించి పెదాల మీద నిర్భయమైన నవ్వును నిలుపుకోవడం నేర్చుకున్నారు. రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ క్రాంతిలో చేరిన ఆడపిల్లలు అందరూ అంతో ఇంతో థియేటర్‌ను కూడా నేర్చుకున్నారు. వీరంతా కలిసి ‘లాల్ బత్తి ఎక్స్‌ప్రెస్’ అనే నాటకం తయారు చేశారు. లాల్ బత్తి అంటే రెడ్‌లైట్ అని అర్థం. నాటకంలో ఈ ఆడపిల్లలందరూ తలా ఒక కంపార్ట్మెంట్గా మారిపోతారు. రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ ఒక్కో స్టేషన్లో ఆగుతూ ఉంటుంది. ఒక్కో కంపార్ట్మెంట్ (అమ్మాయి) తన కథ చెబుతూ ఉంటుంది. ఆ కథలన్నీ వేశ్యల జీవితాలను, వారి పిల్లలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఢిల్లీ, ముంబైలలోనే కాదు న్యూయార్క్, లండన్లలో కూడా ఈ అమ్మాయిలు వెళ్లి ఆ నాటకాన్ని ప్రదర్శించారు. లండన్‌లో నాటక సందర్భంలో అక్కడి వేశ్యలను కలిసి వారి జీవితాలను పరిశీలించారు. ‘పెద్ద తేడా లేదు. అందరం ఒక్కటే’ అని ఒక అమ్మాయి చెప్పింది. ఈ నాటకం జరుగుతున్నంత సేపు వెక్కివెక్కి ఏడ్చే ప్రేక్షకులకు కొదవ ఉండదు. తీర్పులు ఎందుకు? ‘ఇండియాలో సెక్స్‌వర్క్ లీగల్. కాని సమాజపరంగా తప్పు. ఈ విభజన వారిని తమలో తాము కుంచించుకుపోయేలా చేస్తోంది. వారి చదువుకు, వైద్యానికి, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం చేస్తోంది’ అంటుంది రాబిన్ చౌరాసియా. ‘ఇది తప్పు... ఇది ఒప్పు అని తీర్పులు ఇవ్వడం చాలా సులభం. ఒకరిది తప్పు అని అనడానికి మనం ఎవరం? వారు ఆ జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నారో అందులో ఎందుకు కొనసాగుతున్నారో మనం ఊహించగలమా? కనుక తీర్పులు చెప్పడం మానండి. వారిని ఎలా కలుపుకుని పోవాలో ఆలోచించండి’ అంటుందామె.ఇది సుదీర్ఘ ప్రయాస అవసరపడే సంగతే. మనుషులు చాలా నెమ్మదిగా మారుతారు. కాని మారరేమో అనుకుని ఊరికే ఉండటం కన్నా మార్చాలని ప్రయత్నించడమే అవసరం. క్రాంతి సంస్థలోని అమ్మాయిలు చేస్తున్నది అదే.– సాక్షి ఫ్యామిలీ -
యాదగిరిగుట్ట వద్ద వెలుగులోకి వస్తున్న వాస్తవాలు
యాదగిరిగుట్ట : వ్యభిచార గృహాల నిర్వహణ.. చిన్నపిల్లలను ఈ రొంపిలోకి దింపుతున్న వ్యవహారంలో వాస్తవాలు యాదగిరి గుట్టలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 52 ఏళ్లుగా సాగుతున్న ఈ దందాకు అవసరమైన పెట్టుబడులకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేసే ప్రబుద్ధులు ఇక్కడే ఉన్నారు. మరో వైపు ప్రాణాంతకమైన హెచ్ఐవీ వ్యాధి సోకి మృత్యువాతపడ్డ తల్లిదండ్రులు, అనాథలైన పిల్లలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం ప్రారంభమైన పడుపు వృత్తి పుణ్యక్షేత్రానికే మాయని మచ్చగా మిగిలింది. సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట నుంచి పిల్లలతో సహా పారిపోయిన 110 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులు ఎక్కడ ఉన్నారనేది తెలియకుండా పోయింది. 15మంది బాలికలను వ్యభిచార ముఠా కబంధ హస్తాల నుంచి పోలీసులు, అధికారులు రక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొంత మంది బాలికలు వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నారని పోలీసులకు పట్టుబడిన చిన్నారులు చెప్పారు. వ్యభిచార గృహాల నిర్వాహకులు ఇళ్లకు తాళాలు వేసి యాదగిరిగుట్టనుంచి పారిపోవడంతో వారు ఎక్కడ ఉన్నారో అన్నది మిస్టరీగా మారింది. పిల్లలు సురక్షితంగా ఉన్నారా లేక ఇతర ముఠాలకు అమ్మి వేశారా, దూర ప్రాంతాలకు తరలించారా అన్న ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది. మరో Ðవైపు రక్షించిన చిన్నారుల్లో తమ వారు ఉన్నారేమోనని తప్పిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా వరంగల్‌కు చెందిన తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్లు ఏడాది కాలంగా కనిపించకుండాపోయారని బంధువులు వచ్చారు. యాదగిరిగుట్టలో పోలీసులు రక్షించిన బాలికల్లో తమ పిల్లల పోలికలు ఉన్నాయని తెలిపారు. 1966లో పడుపు వృత్తి ప్రారంభం మెదక్ జిల్లా రామయంపేట నుంచి 1966లో కంసాని బూరే అనే వ్యక్తి యాదగిరిగుట్టకు కుటుంబంతో వచ్చి పడుపు వృత్తిని ప్రారంభించాడు. ఒక్క కుటుంబంతో ప్రారంభమైన ఈ వృత్తిలోకి వేలాది మంది వచ్చి వెళ్లారు. ప్రస్తుతం యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వందకు పైగా కుటుంబాలు వృత్తిని నిర్వహిస్తున్నాయి. గతంలో మహిళలను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయించేవారు. అయితే క్రమంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు ఆడ పిల్లలను కొనుగోలు చేసి అమానవీయంగా వారిని వృత్తిలోకి దించుతున్న విషయం తాజాగా వెలుగు చూసింది. పడువు వృత్తికి యాదగిరిగుట్టలో పలువురు రాజకీయ నేతలు, పోలీసు అధికారుల అండదండలు ఉండటం వల్లే వారు ఈస్థాయికి ఎదిగారనేది బహిరంగ రహస్యం. పడుపు వృత్తిలోకి కొత్తగా వచ్చిన వారిని ముందుగా ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారుల వద్దకు పంపించే ఆనవాయితీ కొంతకాలం క్రితం వరకు కొనసాగింది. దీంతో వారు నిర్భయంగా దందాను కొనసాగిస్తూ వచ్చారు. అప్పులిచ్చే వారు దండిగానే.. వ్యభిచార నిర్వాహకుల అవసరాలకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వ్యాపారులు గుట్టలో ఉన్నారు. ఐదారుగురు ఫైనాన్స్ వ్యాపారులు రోజువారీ ఫైనాన్స్ ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఇందులో ఆడపిల్లల కొనుగోలుకు పెట్టుబడిగా అప్పులు ఇచ్చి వారు పెద్దయి వృత్తిలోకి దిగిన తర్వాత డబ్బులు వసూలు చేసుకునే విధానం కొంతకాలంగా కొనసాగుతోంది. రూ.లక్ష ఫైనాన్స్‌గా తీసుకున్న వారు రోజు రూ.1,000చొప్పున మూడు నెలల పది రోజుల్లో చెల్లించాలి. ఇందుకోసం పడుపు వృత్తిని వదలని పరిస్థితి కొందరిలో నెలకొంది. హైదరాబాద్‌లో ఉన్నారా? పారిపోయిన వ్యభిచార నిర్వాహకులు వారి వద్ద ఉన్న పిల్లల కోసం పోలీసులు మూడు బృందాలు గా వెతుకుతున్నారు. గతంలో దాడులు జరిగినప్పుడు వీరంతా వారి బంధువుల ఇళ్లకు వెళ్లి అం తా సద్దుమణిగిన తర్వాత కొంత కాలానికి తిరిగి గుట్టకు చేరుకునేవారు. అయితే ప్రస్తు తం పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వ్యభిచార నిర్వాహకులు హైదరాబాద్, ముంబయి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, విశాఖపట్నం దూ ర ప్రాంతాలకు తరలిపోయి రహస్యంగా తలదా చుకుని ఉండొచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి నిషేధిత ఈస్ట్రోజన్, ఆక్సిటోసిన్ వంటి నిషేధిత ఇంజక్షన్లు ఎక్కడినుంచి సరఫరా అవుతున్నాయి.. వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారన్న కోణంలో పోలీసులు చేపట్టిన విచారణ ముందుకు సాగడం లేదన్న అనుమానం వ్యక్తమవుతోంది. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో గల మెడికల్ దుకాణాలపై దాడులు నిర్వహించిన అధికారులకు ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత ఇంజక్షన్లతో పాటు ఆల్కాహాల్ శాతం అధికంగా ఉండే కోరెక్స్ దగ్గు మందు బయటపడింది. తనిఖీల్లో బయటపడిన నిషేధిత మందులు ఎక్కడ కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు, కంపెనీల వివరాలు సమర్పించాలని కోరారు. ఈ నిషేధిత మందులు ఇక్కడే అమ్ముతున్నారా, పడువు వృత్తి కొనసాగుతున్న రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అమ్ముతున్నారా అంటే నిజమేనని కొందరు మెడికల్ ఏజెంట్లు చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో పడువు వృత్తి సాగుతున్న అన్ని ప్రాంతాల్లో స్టిరాయిడ్స్ అమ్ముతున్నా అవి బయట పడడం లేదు. తాజా సంఘటనతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తత కావాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. వందలాది కుటుంబాలు చిన్నాభిన్నం1993 తర్వాత హెచ్ఐవీ మహమ్మారి యాదగిరిగుట్టలో బయటపడింది. యాదగిరిగుట్టతోపాటు పరిసర గ్రామాలు, ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది తొలినాళ్లలో వేశ్య వృత్తిలో ఉన్న వారితోపాటు వారి వద్ద శారీరక సుఖం కోసం వెళ్లిన వందలాది మంది మృత్యువాతపడ్డారు. బయటికి చెప్పుకోలేని కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. వేశ్యల వద్దకు వెళ్లి హెచ్ఐవీ బారినపడి భర్తలు చనిపోయిన భార్యలు, కూతుర్లను, కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు ఉన్నారు. ఎక్కువగా 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు వారే మృతుల్లో ఉన్నారు. హెచ్ఐవీ సోకిందని తెలిసి పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. పెళ్లికి ఇచ్చిన కట్నం పుట్టింటి వారికి తిరిగి చెల్లించడానికి ఆస్తులను అమ్ముకున్న అత్తింటి వారు ఉన్నారు. పుట్టింటికి చేరిన ఆడ పిల్లలు ఆతర్వాత హెచ్ఐవీ బారినపడి మృత్యువాతపడిన సంఘటనలు ఉన్నాయి. -
వేశ్యా గృహాలపై దాడి..మూడు బస్సులో తరలింపు
చిన్నశంకరంపేట(మెదక్): హైదరాబాద్–నాగపూర్ జాతీయ రహదారిపై ఉన్న జప్తిశివనూర్ గ్రామ శివారులోని సరోజిని నగర్ వేశ్యా గృహాలపై సీఐడీ పోలీసు బృందాలు బుధవారం రాత్రి మెరుపుదాడి చేపట్టాయి. స్థానిక పోలీసులకు సైతం సమాచారం అందించకుండా నేరుగా ఈ కార్యక్రమం చేపట్టిన పోలీసులు మీడియాను సైతం దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకున్నారు. దాడుల్లో మెదక్, సంగారెడ్డి జిల్లా పోలీసులతోపాటు హైదరాబాద్ సీఐడీ బృందాలు పాల్గొన్నాయి. వీరితోపాటు హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థలవారు కూడా పాలుపంచుకున్నారు. జప్తిశివనూర్ వేశ్యా గృహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. 30 కుటుంబాలకు చెందిన మహిళలు, పురుషులతో పాటు సెక్స్ వర్కర్లను బస్సుల్లో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపునే సెక్స్‌వర్కర్లను మొత్తం అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఇళ్లకు తాళాలు వేశారు. వచ్చిన పని ముగించుకుని మూడు బస్సులతో పాటు మరిన్ని అధికారుల వాహనాలతో సంగారెడ్డికి తరలివెళ్లారు. జప్తిశివనూర్లో 30ఏళ్లుగా కొందరు ఇళ్లు నిర్మించుకొని వేశ్యవృత్తిని కొనసాగిస్తున్నారు. వీరికి ప్రభుత్వాలు పునరావాసం కల్పించినా పూర్తిస్థాయిలో నిర్మూలించలేకపోయారు. దీంతో బుధవారం రాత్రి ఒక్కసారిగా రాష్ట్ర సీఐడీ బృందాలతోపాటు పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించి వందమందికిపైగా వేశ్యా గృహాల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని సంగారెడ్డికి తరలించి విచారిస్తున్నారు. గృహాల్లో పూర్తిస్థాయి సోదాలు నిర్వహించి నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాడుల విషయమై ప్రత్యేక బృందం అధికారిని ప్రశ్నించినా వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. విలేకరులు ఫోటోలు తీసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తామే సమాచారం అందిస్తామని, ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఎవరు కూడా దరిదాపుల్లోకి రావద్దని అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళల్లో బలవంతంగా సెక్స్‌రాకెట్‌లోకి దింపినవారు, మైనర్ యువతులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో సీఐడీ అధికారుల బృందం విచారణ చేపట్టింది. హైదరాబాద్ తరలిస్తున్నట్లు ముందు తెలిసినప్పటికీ వారిని సంగారెడ్డిలోని రహస్య ప్రాంతంలోనే మహిళలను మూడు విభాగాలుగా విభజించి విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో 45 ఎళ్లు పైబడిన మహిళలను గృహయజమానులుగా గుర్తించిన పోలీసులు వారిని ఒక గ్రూప్‌గా, 20 ఏళ్లు పైబడిన మహిళలను మరో గ్రూప్‌గా, అంతకు తక్కువ వయస్సు వారిని ఒక గ్రూప్‌గా చేసి వివరాలు రాబడుతున్నారని తెలిసింది. ఇందులో ఆధార్, రేషన్ కార్డు కలిగిన వారిని, అసలు ఎలాంటి అధారం లేని మహిళలను గుర్తించే పనిలో పడ్డారు సీఐడీ అధికారులు.