సాయివిష్ణు జంటకు టైటిల్
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పుల్లెల సాయివిష్ణు సత్తా చాటాడు. శేరిలింగంపల్లిలో జరిగిన ఈ చాంపియన్షిప్లో బాలుర సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన అండర్–15 బాలుర సింగిల్స్ ఫైనల్లో జి. ప్రణవ్ రావు ‘వాకోవర్’ ఇవ్వడంతో సాయివిష్ణు విజేతగా నిలిచాడు. బాలుర డబుల్స్ ఫైనల్లో పి. సాయివిష్ణు–జి. ప్రణవ్ రావు (రంగారెడ్డి) ద్వయం 21–12, 21–18తో కె. భార్గవ రెడ్డి (ఖమ్మం)–పి. సాకేత్ రెడ్డి (నల్లగొండ) జంటపై గెలుపొంది టైటిల్ను కైవసం చేసుకుంది. బాలికల సింగిల్స్ విభాగంలో ఎం. మేఘనా రెడ్డి చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో మేఘన (హైదరాబాద్) 21–15, 19–21, 21–15తో ఎ. అభిలాష (హైదరాబాద్)పై నెగ్గింది. డబుల్స్ ఫైనల్లో ఎ. శిఖా–కె. భార్గవి (రంగారెడ్డి) జంట 21–11, 21–14తో కె. శ్రేష్టా రెడ్డి–ఎస్. వైష్ణవి (హైదరాబాద్) జోడీపై విజయం సాధించింది. విజేతలకు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ట్రోఫీలను అందజేశారు.
అండర్–17 విజేతల వివరాలు: బాలుర సింగిల్స్ ఫైనల్స్: ఎం. తరుణ్ (ఖమ్మం) 22–20, 21–19తో పి. విష్ణు వర్ధన్ గౌడ్ (రంగారెడ్డి)పై గెలుపొందాడు. డబుల్స్ ఫైనల్స్: నవనీత్ (మెదక్)–పి. విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) ద్వయం 23–21, 21–13తో కె. ప్రశాంత్–ఎం. తరుణ్ (ఖమ్మం) జంటపై గెలుపొందింది. బాలికల సింగిల్స్: కేయూర మోపాటి (హైదరాబాద్) 21–16, 18–21, 21–15తో ఎం. మేఘనా రెడ్డి (హైదరాబాద్)పై నెగ్గింది. డబుల్స్ ఫైనల్స్: జి. శ్రీవిద్య–వై. సాయి శ్రీయ (మెదక్) జంట 21–10, 21–13తో ఆశ్రిత (ఖమ్మం)–పూజిత (రంగారెడ్డి) జోడీపై గెలిచింది.