పునరావాస చట్టం అమలు చేయాలి
ఆలూరు (గట్టు ) : పునరావాస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ డిమాండ్ చేశారు. ఆదివారం గట్టు మండలంలోని ఆలూరు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో ఈ గ్రామం ర్యాలంపాడుపాడు రిజర్వాయర్లో ముంపునకు గురైందన్నారు. దీంతో మూడువేల ఎకరాలను రైతులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పరిహారం చాలా తక్కువగా ఇచ్చినట్లు ఆరోపించారు. చెరువులో ముంపునకు గురైన 32 ఎకరాలకు పరిహారమే ఇవ్వలేదన్నారు. పునరావాస కేంద్రంలో పూర్తిస్థాయిలో ప్లాట్లు కేటాయించలేదని, కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేయాలన్నారు. ఈనెల 26న పోరాట నిర్వాసిత కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఉప్పేరు నర్సింహ, రాజు, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.