రియో బరిలో ఐదో సీడ్ గా సైనా
న్యూఢిల్లీ: వచ్చే నెల్లో జరిగే రియో ఒలింపిక్స్‌లో భాగంగా భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ఐదో సీడ్ లభించింది. ఈ మేరకు ఒలింపిక్స్ కు అర్హత సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుల ర్యాంకింగ్స్ ఆధారంగా వారి సీడింగ్ ను ప్రకటించారు. మహిళల విభాగంలో సైనాకూ ఐదో సీడ్ దక్కగా, మరో భారత మహిళ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తొమ్మిదో సీడింగ్‌తో బరిలోకి దిగనుంది. అయితే వరల్డ్ ర్యాంకింగ్స్ లో మాత్రం సింధు పదో స్థానంలో ఉండగా, సైనా ఐదో స్థానంలో ఉంది.
ఇక పురుషుల డ్రాలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వరల్డ్ పదకొండో ర్యాంక్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు తొమ్మిదో సీడింగ్ లభించడం విశేషం. కాగా, సింగిల్స్ విభాగంలో 13 సీడింగ్స్కు మాత్రమే పరిమితం చేశారు. మరోవైపు మలేషియాకు చెందిన లీ చాంగ్ పురుషుల సింగిల్స్ లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతుండగా, మహిళల సింగిల్స్‌లో స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ టాప్ సీడింగ్ లభించింది. 41 మంది పాల్గొనే పురుషుల సింగిల్స్ ను 13 గ్రూప్‌లుగా విభజించగా, 40 మంది మహిళల సింగిల్స్‌ను కూడా 13 గ్రూప్‌లుగా విభజించారు. ఇలా ప్రతీ గ్రూప్ లోనూ ఒక సీడింగ్ ప్లేయర్ ఉంటారు. ఇదిలా ఉండగా, డబుల్స్ విభాగంలో నాలుగు జంటలకు నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇక్కడ ప్రతీ గ్రూప్‌లోనూ ఒక సీడెడ్ జంట ఉంటుంది.