సీఎంగారూ... సమయమివ్వండి: జూడాలు
హైదరాబాద్: వైద్యాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందుకే జూనియర్ డాక్టర్లపై గ్రామీణ సర్వీసు వంటి అసంబద్ధ వాదనలు తీసుకొస్తున్నారని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్లో జరుగుతున్న జూడాల రిలే నిరాహార దీక్షలకు శనివారం సంధ్య, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. నర్సయ్యలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుల మొండివైఖరి కారణంగా ప్రజలు ప్రభుత్వ వైద్యానికి దూరం కావాల్సిన దుస్థితి నెలకొంటోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జూడాల పట్ల సానుకూలంగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమ్మెలో భాగంగా శనివారం జూడాలు దీక్షా శిబిరంలో పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు. చర్చల కోసం తవుకు 15 నిమిషాల సవుయుం ఇవ్వాలని సీఎంను కోరారు.
కార్యక్రమంలో తెలంగాణ జూడాల అసోసియేషన్ కన్వీనర్ శ్రీనివాస్, అధ్యక్షుడు క్రాంతి తదితరులు పాల్గొన్నారు. జూడాలకు మద్దతుగా వారి తల్లిదండ్రులూ ఆందోళన బాట పట్టనున్నారు. ఈ మేరకు శనివారం ‘జూడా పేరెంట్స్, సిటిజెన్స్ ఫోరం’ ఏర్పాటయింది. జూనియర్ డాక్టర్లను శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది.