ఇడ్లీల కోసం గొడవ, స్నేహితుడు హత్య
కోయంబత్తూరు: ఓ వ్యక్తి మద్యంమత్తులో ఇడ్లీల విషయంలో గొడవపడి స్నేహితుడిని చంపాడు. తమిళనాడులో కోయంబత్తూరులోని తీతిపాల్యం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మరప్పన్, శర్వాణన్ అనే ఇద్దరు స్నేహితులు ఇటీవల కలసి మద్యం తాగారు. అనంతరం శర్వాణన్ ఇడ్లీలు తీసుకునేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరగా మరప్పన్ నిరాకరించాడు. ఈ విషయంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. అనంతరం ఇద్దరూ కలసి గంజాయి తాగారు. శర్వాణన్ మళ్లీ ఇడ్లీల కోసం డబ్బులు అడగ్గా, మరప్పన్ ఇవ్వలేదు. దీంతో ఇద్దరూ గొడవపడ్డారు. వాటర్ ట్యాంక్ దగ్గర మరప్పన్ గోడపైనుంచి శర్వాణన్ను తోసివేశాడు. కిందపడ్డ శర్వాణన్ తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయాలయ్యాయి. అతన్ని వెంటనే కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. శర్వాణన్ చికిత్స పొందుతూ మరణించాడు.