పాపకోసం.. 25కిలోమీటర్లు..
రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతల అవస్థలు
పిల్లల వైద్య నిపుణులు, మత్తడాక్టర్ పోస్టులు ఖాళీ
పట్టించుకోని జిల్లా వైద్యశాఖ అధికారులు
జిల్లాలోనే ఉత్తమ ఆస్పత్రి దుర్భరస్థితి ఇది..
రాయికల్ : ఉత్తమ ఆస్పత్రిగా మూడుసార్లు ఎంపికైంది.. అందులో పనిచేస్తున్న వైద్యురాలు మూడుసార్లు ఉత్తమ వైద్యురాలిగా అవార్డు అందుకుంది.. అక్కడ ప్రసవాల సంఖ్య ఎక్కువే.. అలాంటి రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణుడు, మత్తు డాక్టర్ లేకపోవడంతో బాలింతలకు అవస్థలు తప్పడంలేదు. ప్రసవం తర్వాత పిల్లలను చూపించేందుకు 25కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల, కోరుట్ల వంటి పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో తల్లులు, పసికందులు అవస్థలు తప్పడంలేదు.
రాయికల్ మండల కేంద్రంలోని ఆస్పత్రి ఏడాది క్రితం 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయింది. ఇక్కడ స్త్రీవైద్య నిపుణులుగా పనిచేస్తున్న చైతన్యసుధకు మూడుసార్లు ఉత్తమ స్త్రీవైద్య నిపుణురాలిగా అవార్డు వచ్చింది. దీంతో మల్లాపూర్, మేడిపల్లి, రాయికల్ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన గర్భిణులు రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకుంటున్నారు. ప్రతి నెల 60వరకు ప్రసవాలు జరుగుతాయి. అయితే ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణులు, మత్తుడాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో బాలింతలు, వారి బంధువులకు ఇబ్బందులు తప్పడంలేదు. ముఖ్యంగా ప్రసవం తర్వాత పాపను పిల్లల వైద్య నిపుణుడికి చూపించాలి. దీంతో ఆ పసికందును పట్టుకుని కుటుంబసభ్యులు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాలకు ఆటోలు, జీపుల ద్వారా ప్రైవేటు వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి. తల్లి దగ్గర ఒకరు, పిల్లాడితో మరొక కుటుంబసభ్యులు తప్పనిసరిగా ఉండాల్సిదే.
ఆటోలో ప్రయాణం..
రాయికల్ ఆస్పత్రిలో గురువారం పది ప్రసవాలు చేయగా.. పసికందులందరినీ జగిత్యాలకు తీసుకెళ్లారు. అందరూ కలిసి రెండు ఆటోలు మాట్లాడుకుని Ðð ళ్లారు. ఉదయం 9.30గంటలకు బయలుదేరగా.. మధ్యాహ్నం 3గంటలకు వారు రాయికల్‌కు చేరుకున్నారు. అప్పటి వరకు పిల్లల కోసం బాలింతలు ఎదురుచూడాల్సిందే. జిల్లాలోనే ఉత్తమ ఆస్పత్రిలోనే పిల్లల వైద్యనిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఈ దైన్య పరిస్థితి నెలకొంది. ఈవిషయంపై పలుమార్లు జిల్లా వైద్యశాఖ అధికారుల దృష్టికి స్థానిక వైద్యులు తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. కలెక్టర్ స్పందించి రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి పూర్తిస్థాయిలో పిల్లల వైద్యనిపుణుడిని, మత్తు డాక్టర్‌ను నియమించాలని కోరుతున్నారు. ఈవిషయమై మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ విరణ కోరగా.. ‘ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తుడాక్టర్, పిల్లల వైద్యనిపుణులు లేకపోవడంతో గర్భిణులు 8 నెలలపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించుకుని ప్రసవాల సమయంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.’ అని చెప్పారు.
బాబు పుట్టగానే జగిత్యాలకు తీసుకెళ్లా.
నాకు గురువారం రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలు చైతన్యసుధ ప్రసవం చేసింది. నాకు బాబు పుట్టాడు. పుట్టగానే బాబుకు వైద్య పరీక్షల నిమిత్తం 25 కి.మీ దూరంలో ఉన్న జగిత్యాలకు మా అమ్మ తీసుకెళ్లింది.
– లక్ష్మి, పెంబట్ల, సారంగాపూర్ మండలం