ఆన్లైన్లో రైల్వే ట్రాక్‌ల పర్యవేక్షణ
న్యూఢిల్లీ: రైల్వే మార్గాల (ట్రాక్‌ల) పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తోడ్పడే వెబ్ ఆధారిత ‘ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టం (టీఎంఎస్)’ను రైల్వే అమల్లోకి తీసుకువచ్చింది. ట్రాకుల ఉష్ణోగ్రత, వంతెనల వద్ద నీటి మట్టం తదితర పరిస్థితులను ఆన్లైన్ విధానం ద్వారా పరిశీలించగలిగే విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. గురువారం ఢిల్లీలో జరిగిన ఒక సెమినార్లో రైల్వే బోర్డు సభ్యుడు వీకే గుప్తా ఈ వివరాలను వెల్లడించారు. ట్రాకుల నిర్వహణ ముఖ్యమైన అంశమని, అన్ని రైల్వే డివిజన్లలో టీఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు, ఎక్కువ రద్దీ ఉండే క్రాసింగ్‌ల వద్ద పరిస్థితిని సరిదిద్దేందుకు 1,400 ఓవర్ బ్రిడ్జిలు, 7,500 అండర్ బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, ప్రమాదాలను నిరోధించేలా భద్రతా ప్రమాణాల పెంపునకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఢిల్లీలో చెప్పారు.