కిడ్నాప్..దోపిడీ కేసులో 9 మందికి జీవితఖైదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కిడ్నాప్‌లు చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యులకు జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధిస్తూ 2వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ప్రాసిక్యూటర్ రజిని కథనం ప్రకారం... కాటేదాన్ టీఎన్జీఓ కాలనీ నివాసి శ్రీనివాస్‌కు జూబ్లీహిల్స్‌కు చెందిన రాహుల్ తన వద్ద అతీతశక్తులు గల పురాతన రైస్‌పుల్లర్ ఉందని నమ్మించాడు. శ్రీనివాస్ ఆ రైస్‌పుల్లర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
2009 మే 14న శ్రీనివాస్, తన మిత్రుడు కృష్ణారెడ్డితో కలిసి తన ఇంటి వద్ద ఉండగా.. అక్కడికి రాహుల్ స్కార్పియో వాహనంలో వచ్చాడు. వాహనంలో అతడి మిత్రులు వెంకటదుర్గారావు, శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, ధనుష్‌కుమార్, పోతరాజు, రామలింగప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నారు. రైస్‌పుల్లర్ చూపిస్తామని శ్రీనివాస్, ఆయన మిత్రుడు కృష్ణారెడ్డిని తమ వాహనంలో జూబ్లీహిల్స్ తీసుకెళ్లి ఓ ఇంట్లో బంధించారు. దాడి చేసి వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో పాటు బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. మిమ్మల్ని కిడ్నాప్ చేశామని, రూ.3 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని, లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారు.
దీంతో శ్రీనివాస్ రూ.3 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి వారి నుంచి తప్పించుకుని మిత్రుల సహాయంతో శివరాంపల్లి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొగల్పురా పోలీస్ స్టేషన్లో మరో కేసులో నిందితులుగా ఉండి అరెస్టయిన ఈ తొమ్మిది మందినీ కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన 2వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గాంధీ.. నిందితులకు జీవితఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.