రాజ్యసభలో నేడు తెలంగాణ బిల్లు లేనట్లే
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు మంగళవారం రాజ్యసభ ముందుకు రాదని కేంద్రమంత్రి రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, లేక నేరుగా లోక్‌సభలో ప్రవేశపెట్టాలా అనే దానిపై చర్చిస్తున్నట్లు ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. దీనిపై ఈరోజు స్పష్టత వస్తుందని రాజీవ్ శుక్లా తెలిపారు. దాంతో నేడు రాజ్యసభలో పార్లమెంట్ బిల్లు లేనట్లే.
మరోవైపు ఏది ఏమైనా బిల్లు ఎప్పుడూ ప్రవేశపెట్టాలన్నది నేడు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం లోక్‌సభ వ్యవహారాల కమిటీ సమావేశమవుతోంది. లోక్‌సభలోనే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తే మరోసారి రాష్ట్రపతి సిఫార్సు అవసరమవుతుంది. మొత్తానికి రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్రం తీవ్ర గందరగోళంలో ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ ఈరోజు సాయంత్రం అత్యవసరంగా సమావేశం అవుతోంది.