జీవుడిలోనే దైవం ఉంది
నిజామాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జీవుడిలోనే దైవం ఉందని మత గురువులు పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతోనే శాంతి సాధ్యమన్నారు. ఆదివా రం రాత్రి జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం ప్రాంగణంలో ఉన్న న్యూ అంబేద్కర్ భవన్లో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్, గౌరవ అతిథులుగా వివిధ మతాల ప్రతినిధులు శక్చంద్ హజూర్ సహాబ్ జ్ఞానీ అమర్జీత్సింగ్, శ్రీరామానంద సరస్వతి, ఫాస్టర్ పాల్, జెమాతె ఇస్లామీ హింద్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సుబాన్ సాహెబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మతాలు దేవుడొక్కడేనని చెబుతున్నాయన్నారు. కాకపోతే మనషుల్లోనే రాగద్వేషాలతో మనస్పర్ధలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రేమతో అందరినీ సంఘటితం చేయొచ్చన్నారు.
అన్ని మతాల్లో మంచే ఉందని, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మత గ్రంథాలు దానిని బోధిస్తున్నాయని పేర్కొన్నారు. మతగురువులు చెప్పే మంచి మాటలను పెడచెవిన పెట్టడంతోనే అరాచకం పెరిగిపోతోందన్నారు. చెడును రూపు మాపేందుకు అన్ని మతాలవారు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా అరీఫుద్దీన్ సాహెబ్ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో సంస్థ నిజామాబాద్ కన్వీనర్ షేక్ హుస్సేన్, నగర అధ్యక్షుడు రహమాన్ దావూదీ తదితరులు పాల్గొన్నారు.