లండన్‌లో తొలిప్రేమ
పవన్‌కల్యాణ్ ‘తొలిప్రేమ’లో క్లైమాక్స్ సీన్ గుర్తుందా? హార్వర్డ్ యూనివర్శిటీకి వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కే ముందు హీరోకి ‘ఐ లవ్యూ’ చెప్తుంది హీరోయిన్. అప్పటివరకూ కథంతా ఇండియాలోనే జరుగుతుంది. సిన్మా కూడా! ఇప్పుడు బాబాయ్ టైటిల్‌తో అబ్బాయ్ చేస్తున్న కథ మాత్రం సరిహద్దులు దాటింది. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తొలిప్రేమ’.
ఇందులో సెకండాఫ్‌లో కీలక సన్నివేశాలన్నీ లండన్‌లో జరుగుతాయట. వాటి చిత్రీకరణ కోసం లండన్ వెళ్లడానికి టీమంతా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. సుమారు 30 రోజులు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, వరుణ్, రాశీలపై రెండు పాటలు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి స్వరకర్త.