నాడు తూటా.. నేడు టీ..
రాంచీ: జార్ఖండ్‌కు చెందిన రష్మీ మహ్లీ ఒకప్పుడు పోలీసులను చూస్తే.. ఆగ్రహంతో రగిలిపోయేది. వారిపై తూటాలు కురిపించేది. మరిప్పుడో.. వారినే ఆప్యాయంగా పలకరిస్తోంది.. టీ అందిస్తోంది! రష్మీ ఓ మావోయిస్టు. చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్లిపోయింది. మరో నక్సల్‌ను పెళ్లి చేసుకుంది. జార్ఖండ్ కీలక మావోయిస్టు నేత, అక్కడి వీరప్పన్‌గా పేరొందిన కుందన్ పహాన్ గ్రూపులో ఏడేళ్లపాటు పనిచేసింది. మహిళా నక్సల్స్ దళం నారీముక్తి సంఘ చోటానాగ్పూర్ జోన్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించింది. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త పోలీసు కాల్పుల్లో మరణించాడు. అయితే, దీన్ని అలుసుగా తీసుకుని సహచరులు లైంగిక వేధింపులకు గురిచేయడం.. హింసపై రష్మీకి విరక్తి కలగడం వంటి కారణాలతో 2011లో పోలీసులకు లొంగిపోయింది.
అక్కడ్నుంచి ఆమె జీవితమే మారిపోయింది. లొంగిపోయిన నక్సల్స్ పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం నుంచి రూ.1.5 లక్షలు వచ్చాయి. దీంతో అధికారుల సహకారంతో ఆమె రాంచీ కలెక్టరేట్లోని డిప్యూటీ పోలీసు కమిషనర్ కార్యాలయం వద్దే టీస్టాల్‌ను ఏర్పాటు చేసుకుంది. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ టీ స్టాల్‌ను డిప్యూటీ కమిషనర్ సాకేత్ కుమార్ ప్రారంభించారు. రష్మీ.. ఇప్పుడు భవిష్యత్‌పై ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తోంది. అంతేకాదు.. తన ఎనిమిదేళ్ల కొడుకు ఏదో ఒకరోజు తప్పకుండా పోలీసు అవుతాడని గర్వంగా చెబుతోంది.