అక్టోబర్‌కల్లా వైజాగ్ స్టీల్ ఐపీవో!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్ఐఎన్ఎల్- వైజాగ్ స్టీల్) పబ్లిక్ ఇష్యూని అక్టోబర్‌కల్లా చేపట్టే అవకాశముంది. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 10% వాటాను విక్రయించనుంది. రెండు వారాల్లోగా వైజాగ్ స్టీల్‌ను లిస్ట్ చేసే అంశంపై డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ కసరత్తును మొదలుపెట్టనున్నట్లు స్టీల్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. వార్షికంగా 2.9 మిలియన్ టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యాన్ని కలిగిన వైజాగ్ స్టీల్ రూ. 12,300 కోట్లతో చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు దాదాపు పూర్తికావస్తున్నాయి.
తద్వారా 6.3 మిలియన్ టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యాన్ని అందుకోనుంది. అంతేకాకుండా 2025-26కల్లా 20 మిలియన్ టన్నులకు సామర్థ్యాన్ని విస్తరించాలని ప్రణాళికలు వేసింది. కాగా, వైజాగ్ స్టీల్ లిస్టింగ్ ప్రతిపాదనను గత రెండేళ్లలో ప్రభుత్వం మూడుసార్లు వాయిదా వేసింది. ఐపీవోకు నిర్ణయించిన ధర విషయంలో ఏర్పడ్డ వివాదాలతో ఒకసారి, ప్లాంట్‌లో యాక్సిడెంట్ జరిగి 19 మంది మరణించడంతో మరోసారి ఐపీవో వాయిదా పడిన విషయం విదితమే. 2010లో షరతుల ద్వారా లభించిన నవరత్న హోదాను నిలుపుకోవాలంటే వైజాగ్ స్టీల్‌ను లిస్టింగ్ చేయాల్సి ఉంది.