వైద్యసేవలకు ‘జనసేవ’ సహకారం
పింప్రి, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేవా ఫౌండేషన్ సంపూర్ణ సహకారం అందిస్తోంది. గ్రామీణులకోసం రాష్ట్రీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్ఆర్హెచ్ఎం) కింద ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. పుణే జిల్లా వేల్హా తాలూకాలోని కొండలు, అటవీ ప్రాంతాల్లోగల గ్రామాలకు మొబైల్ క్లినిక్‌లలో సిబ్బంది చేరుకుని సేవలందిస్తున్నారు. 2011 నుంచి ఈ మొబైల్ క్లినిక్‌లు అందుబాటులోకివ చ్చాయి. వీటిద్వారా ఈ ఏడాది మార్చినాటికి రెండు వేల మందికి వైద్యసేవలను అందించినట్లు మొబైల్ క్లినిక్ ప్రాజెక్టు సమన్వయకర్త సునీల్ కఠారే వెల్లడించారు. వేల్హా తాలూకాలోని 65 గ్రామాల్లో ఆస్పత్రులే లేవు. దీంతో మొబైల్ క్లినిక్‌లద్వారా సంవత్సర కాలంలో 25 వేల మందికి పైగా ప్రజలకు వైద్యసేవలను ఉచితంగా అందించామని సునీల్ తెలిపారు.
ప్రతి సోమవారం మొదలుకుని శుక్రవారం వరకు ఆయా గ్రామాలకు వెళ్లి వైద్య పరీక్షలతోపాటు చికిత్స చేస్తున్నామన్నారు. ఇదిలాఉంచితే జన సేవా ఫౌండేషన్ నిర్వాహకుల సహకా రం కారణంగా తమ బతుకుల్లో వెలుగులొచ్చాయంటూ గ్రామీణులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులు, వయోధికులు, చిన్న పిల్లలకు ఉచితంగా మందు లు అందజేస్తూ వారి బాగోగులను చూస్తున్నారు. మొబైల్ క్లినిక్‌లో ప్రభుత్వ వైద్యులతోపాటు తమ ఫౌండేషన్‌కి చెందిన వైద్యులు కూడా సేవలందిస్తున్నట్లు సునీల్ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రోగి ఉన్నట్లయితే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తామని, గ్రామీణుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున ఓ డాక్టర్, నర్సు, ఫార్మిస్టులతోపాటు జనసేవా ఫౌండేషన్‌కు చెందిన ఇద్దరు ప్రత్యేక వైద్యులద్వారా సేవలను అందిస్తున్నామని ఆయన వివరించారు.