గడువులోనే గడబిడ!
ఫ్లాట్ల అప్పగింతలో ఆలస్యం.. నిధుల కొరత
2014లో దేశంలో స్థిరాస్తి రంగానికి గడ్డుకాలం
రాజకీయ అనిశ్చితి.. నిర్మాణ పనుల్లో ఆలస్యం.. నిధుల కొరత.. వెరసి 2014లో దేశంలో స్థిరాస్తి రంగానికి గడ్డుకాలం ఎదురైంది. ఇచ్చిన గడువులోగా ఫ్లాట్లను అందించడంలో బిల్డర్లు విఫలమవ్వడంతో రియల్ అమ్మకాలూ తగ్గుముఖం పట్టాయి. కొత్త ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు.. చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు, విక్రయించేందుకే రియల్టర్లు మొగ్గు చూపారని ప్రాప్‌ఈక్విటీ సంస్థ నివేదిక చెబుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో చేపట్టిన సర్వే సారాంశంపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది.
గతేడాదితో పోల్చుకుంటే ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొత్త ప్రాజెక్ట్‌లు 42 శాతం తగ్గుముఖం పట్టాయి. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో 59 శాతం తక్కువగా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. 2013లో హైదరాబాద్‌లో 18,515 కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది కేవలం 7,589 మాత్రమే ప్రారంభమయ్యాయి. -51 శాతంతో ముంబై రెండో స్థానంలో నిలిచింది.
2013లో ముంబైలో 80,953లో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది 39,491, అలాగే -48 శాతంతో ఢిల్లీలో 2013లో 88,879 ప్రారంభం కాగా.. 2014లో 46,636 ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. అదే -26 శాతంతో బెంగళూరులో గతేడాది 63,798లకు గాను.. ఈ ఏడాది 47,207 ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. కేవలం కోల్‌కతా స్థిరాస్తి వ్యాపారంలో మాత్రమే కాసింత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. గతేడాది 15,043 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది 5 శాతం పెరుగుదలతో 15,866 కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు.
గడువు గండం..
2014లో ప్రతి త్రైమాసికంలోనూ స్థిరాస్తి అమ్మకాలు పడిపోతూ ఉన్నాయి. ధరలు ఇంకా తగ్గుతాయనే నమ్మకంతో కొనుగోలుదారులు ఇంకా వేచి చూస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని సర్వే చెబుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏడు ప్రధాన నగరాల్లో కేవలం 23.5 శాతం మాత్రమే ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందించారు. మొ త్తం 4,70,183 ఫ్లాట్లను అందించాల్సి ఉండగా.. కేవలం 1,10,510 ఫ్లాట్లకు మాత్రమే తాళాలను అందించగలిగారు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి, ఉన్న వాటిని విక్రయించడానికే నిర్మాణ సంస్థలకు చుక్కలు కనిపిస్తున్నాయి మరి.
రిజిస్ట్రేషన్ శాఖకు గండే..
2014లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికీ భారీగానే గండి పడింది. లోన్ల విషయంలో కనికరించని బ్యాంకులు, రాజకీయాంశం, ఎన్నికలు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్లాట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను ప్రభావితం చేశా యి. రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఏడాది అక్టోబర్ వరకు హైదరాబాద్‌లో 525.69 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం 277.99 కోట్లను గడించింది. రంగారెడ్డి జిల్లాలో చూస్తే.. 1,346.16 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. 690.84 కోట్లను మాత్రమే ఆర్జించింది.