షోలాపూర్‌లో ఫైవ్‌స్టార్ హోటల్
షోలాపూర్, న్యూస్‌లైన్: పర్యాటకులను ఆకర్షించేందుకు పట్టణంలో మొట్టమొదటి సారిగా నిర్మించిన ఐదు నక్షత్రాల హోటల్‌ను శనివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ హోటల్‌ను నిర్మించిన వ్యక్తి తెలుగు వారు కావడం గర్వకారణం. స్థానిక ‘బాలాజీ అమైన్స’ యాజమాన్యం అయిన రెడ్డి సోదరులు రాజేశ్వర్‌రెడ్డి, రామ్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఈ హోటల్ నిర్మాణం చేపట్టారు. బాలాజీ సరోవర్ ప్రీమియర్ పేరుతో కొత్తగా అస్రాచౌక్ సమీపంలో రోడ్డుకు దగ్గరగా మూడు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.
కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎం.డీ. కె.ఎన్.మాన్వి ఈ హోటల్‌ను ప్రారంభించనున్నారని కంపెనీ ఎండీ రాంరెడ్డి మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ హోటల్ పట్టణంలో మొట్టమొదటిది, రాష్ట్రంలో తొమ్మిదవదిగా నిలిస్తుందన్నారు. ఇందులో అత్యంత ఆధునిక హంగులున్న 129 గదులు ఉన్నాయన్నారు. కంపెనీ డెరైక్టర్ ఎన్.రాజేశ్వర్‌రెడ్డి, అనిల్ మదోక్, హోటల్ మేనేజర్ బర్జిన్ మాస్టార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రెడ్డి సోదరులు 1985లో పట్టణానికి వచ్చి సిమెంట్ పైపులు తయారు చేసే కార్ఖానా స్థాపించారు. తర్వాత బాలాజీ గ్రూప్‌కు శ్రీకారం చుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. తర్వాత కెమికల్స ఉత్పత్తుల్లో ప్రగతి సాధించారు.