24న ఎస్బీఐ ‘ఎస్ఎంఈ సండే’
ఏలూరు (ఆర్ఆర్ పేట): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 24న ఎస్ఎంఈ సండే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బ్యాంక్ రీజనల్ మేనేజర్ కె.రంగరాజన్ తెలిపారు.
స్థానిక స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్టారు. ఎస్ఎంఈ సండే కార్యక్రమం ద్వారా రీజియన్ పరిధిలోని చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ కోసం రుణాలు అందజేస్తామన్నారు. జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, చింతలపూడి, ఏలూరు మెయిన్ బ్రాంచ్‌తో పాటు 8 స్థానిక శాఖల్లో అదేరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బ్యాంకు సిబ్బంది పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉండి రుణాలు అందించడంలో సహకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా రూ. 25 వేల నుంచి రూ. 25 కోట్ల వరకు రుణాలు అందించడానికి బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. 24న ఒక్కరోజే సుమారు రూ.40 కోట్లు రుణాలుగా అందించాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. రుణాలపై వడ్డీ 11 నుంచి 12.50 శాతం వసూలు చేస్తామని చెప్పారు. అనంతరం ఎస్ఎంఈ సండే ప్రచార రథాలను ప్రారంభించారు. మెయిన్ బ్రాంచ్ ఏజీఎం ఎంవీఎస్ ప్రసాద్, మార్కెటింగ్ హెడ్ ఎం.జోషి, చీఫ్ మేనేజర్ సీహెచ్ కిషోర్‌రెడ్డి, ఏలూరు రీజియన్ చీఫ్ మేనేజర్ ఏవీవీఎస్ రెడ్డి, జి.వెంకటేశ్వర్లు, ఎన్.శాంతి పాల్గొన్నారు.