గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
విజయవాడ: గన్నవరం నుంచి దేశ వాణిజ్య రాజధానిగా చెప్పే ముంబైకి మరికొన్ని రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతోంది. జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్ ఏ320 విమాన సర్వీసును ప్రారంభించనుంది.ప్రారంభ ఆఫర్గన్నవరం నుంచి ముంబైకి నడపనున్న డైరెక్ట్ విమాన సర్వీస్‌కి ప్రారంభ ఆఫర్‌గా టికెట్ ధరను రూ.5600గా ఎయిర్ఇండియా నిర్ణయించింది. తర్వాత డిమాండ్‌ను బట్టి ఈ ధర మారే అవకాశం ఉంది. ప్రతి రోజూ రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి విమానం బయలుదేరి రాత్రి 9 గంటల కల్లా ముంబైకి చేరుతుంది. అంటే ప్రయాణ సమయం కేవలం గంటా యాభై నిమిషాలు మాత్రమే.ఇప్పటి వరకూ విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు లేదు. చాలా విమానాలు హైదరాబాదు మీదుగా కనెక్టింగ్ సర్వీసుగా వెళ్లే పరిస్థితి ఉండేది. దీంతో ప్రయాణ సమయం ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు కావాలని నగరంలోని వ్యాపారులు, ఇతర వర్గాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఉంది. దీన్ని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి విమానయాన సంస్థల దృష్టికి తీసుకెళ్లగా ఎయిర్ ఇండియా వెంటనే స్పందించింది. విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ప్రారంభ ఆఫర్‌గా కేవలం రూ.5600లకే ముంబైకి ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. సాధారణ ధరలతో పోల్చుకుంటే రూ.4600 తగ్గింపు ఇచ్చింది.గన్నవరం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉంది. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వ్యాపారపరంగా కీలకమైన గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో విజయవాడ-ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసు ప్రారంభం కానుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.