వహ్... వాల్ష్
ఏ ఆటైనా, ఏ ఆటగాడైనా మొదటి లక్ష్యం విజయం. ఎలాగైనా ప్రత్యర్థిపై గెలవాలనే కసే ఉంటుంది. దీనికోసం చాలా మంది నైతికతను వదిలేస్తారు. కానీ కొంతమంది మాత్రం క్రీడాస్ఫూర్తికి ప్రాధాన్యత ఇచ్చి చరిత్రలో నిలుస్తారు. అలా చరిత్రలో నిలిచిన క్రికెటర్ కోట్నీ వాల్ష్.
1987 రిలయన్స్ వరల్డ్ కప్.. లాహోర్ వేదిక.. వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ పేసర్ ఇమ్రాన్ ఖాన్ (4/37) ధాటికి 216 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత పాక్ బరిలోకి దిగింది. 92 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా కోలుకుని 183 పరుగులకు ఐదు వికెట్లతో లక్ష్యం వైపు సాగింది. ఈ దశలో పాక్ జట్టుకు మళ్లీ కుదుపు. 20 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఇక మిగిలింది చివరి ఓవర్. ఆరు బంతుల్లో పాక్‌కు కావాల్సిన పరుగులు 14. తన పేస్‌తో బ్యాట్స్‌మెన్‌ను వణికించే బౌలర్ వాల్ష్ ఆఖరి ఓవర్ వేసేందుకు సిద్ధమయ్యాడు.
క్రీజులో ఉందేమో టెయిలెండర్లు అబ్దుల్ ఖాదిర్.. సలీం జాఫర్. ఇంకేముంది.. ఆతిథ్య జట్టు ఓటమి ఖాయమే అనుకున్నారు. తొలి రెండు బంతులకు సింగిల్స్ వచ్చాయి. మూడో బంతికి రెండు పరుగులు తీసిన ఖాదిర్... నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి రెండు పరుగులు చేస్తే పాక్ గెలుస్తుంది.
ఇక్కడే అసలు సిసలు క్రీడా స్ఫూర్తి అంటే ఏమిటో వాల్ష్ లోకానికి చాటి చెప్పాడు. చివరి బంతి వేసేందుకు సిద్ధమవుతున్న వాల్ష్ చేతిలో నుంచి బంతి ఇంకా వదలక ముందే నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న జాఫర్ క్రీజు నుంచి ముందుకు కదిలాడు. ఈ స్థితిలో వాల్ష్ అతడ్ని మన్కడింగ్ ద్వారా రనౌట్ చేయవచ్చు. సాంకేతికంగా కూడా అది కరెక్ట్ కూడా. రనౌట్ చేస్తే వెస్టిండీస్‌దే విజయం. కానీ వాల్ష్ మాత్రం బంతి వేయకుండా ఆగి జాఫర్‌ను వెనక్కి పిలిచి క్రీజులోకి రమ్మన్నాడు. ఆఖరి బంతికి ఖాదిర్ రెండు పరుగులు చేసి పాక్‌ను గెలిపించాడు. మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోయింది.
ఈ ఓటమివల్ల వెస్టిండీస్ సెమీస్‌కు చేరలేదు. మ్యాచ్‌లో విండీస్ ఓడిపోయినా వాల్ష్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఈ పేసర్ పెద్దమనసుకు పాకిస్థాన్‌లో అభిమానులు అనేక బహుమతులూ పంపారు. ఆటలో క్రీడాస్ఫూర్తి ఎంత ముఖ్యమో చెప్పడానికి వాల్ష్ పెద్ద ఉదాహరణ.