ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసు పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల (సెంట్రల్ హెల్త్ సర్వీసెస్) పరిధిలోని వైద్యులకు తీపి కబురు. ప్రభుత్వ డాక్టర్ల పదవీ విరమణ వయోపరిమితిని 65 సంవత్సరాల పెంపుకు ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశంలో వైద్య సేవల కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా వైద్యుల పదవీ విమరణ వయసును పెంచుతామని... రెండేళ్ల పాలన విజయోత్సవ సభ వేదికగా ప్రధాని మోదీ సహరాన్పూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల పదవీ విరమణ పెంపు నిర్ణయానికి ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వయో పరిమితి పెంపు నిబంధన నేటి నుంచి అమల్లోకి రానుంది. కేంద్రం లేదా రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కింద పనిచేసే వైద్యులకైనా ఈ నిర్ణయం వర్తిస్తుంది.
కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు కొన్ని రాష్ట్రాల్లో 60 సంవత్సరాలుగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో 62 సంవత్సరాలుగా ఉంది. తాజాగా కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో వైద్యుల పదవీ విరమణ వయసు రాష్ట్రాల్లో అయినా, కేంద్ర ప్రభుత్వంలో అయినా 65 ఏళ్లకు ఉంటుంది. కాగా దేశంలో నెలకొన్న ప్రభుత్వ వైద్యుల కొరతను అధిగమించడానికి కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా మాట్లాడుతూ వైద్యుల పదవీ విరమణ వయసు పెంచడం వల్ల మరింత మెరుగైన వైద్య సేవలుఅందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దీనివల్ల పేదలకు వైద్య సేవలు అందుతాయన్నారు.