రెగ్యులరైజ్’ ధమాకా!
నిరుపేదలకు శుభవార్త
నాలుగు పద్ధ్దతుల్లో అనధికార గృహాల రెగ్యులరైజేషన్
125 గజాలలోపు నివాసాలకు ఉచితం
మిగతా నివాసాలకు రుసుం నిర్ణయం
సిటీబ్యూరో: ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు శుభవార్త. అనధికార గృహాలన్నింటినీ రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక రెగ్యులరైజ్‌కు సంబంధించిన రుసుము, విధివిధానాలను త్వరలో ఖరారు చేస్తారు. నగరంలోని ప్రభుత్వ భూముల్లో సుమారు 1.30 లక్షల నుంచి 1.60 లక్షల వరకు నివాసాలు ఉన్నట్లు అధికారయంత్రాంగం ఇప్పటికే గుర్తించింది. వీటిలో 15 నుంచి 50 గజాల లోపు స్థలంలో నివాసం ఉంటున్న వారందరిని ఒక పూల్‌గా మార్చి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి శాశ్వత నివాసం కల్పించనున్నారు. ఇక మిగతావాటి రెగ్యులరైజేషన్ను నాలుగు విధాలుగా చేయనున్నారు...
► 125 గజాల స్థలం లోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఎలాంటి రుసుం లేకుండా రెగ్యులరైజ్ చేస్తారు
► 250 నుంచి 300 గజాల స్థలంలోపు ఏర్పాటు చేసుకున్న వారికి తక్కువ రుసుంతో ప్యాకేజీ
► 500 గజాలలోపు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్న వారి భూములకు ప్రతి 100 గజాలకు కొంత ధర పెంచుతూ రుసుం విధిస్తారు
► 4,500 గజాలకుపైగా భూమిలోని నివాసాలు, శాశ్వత నిర్మాణాలకు భారీ మొత్తంలో రుసుం నిర్ణయించి రెగ్యులరైజ్ చేస్తారు