లారీ- టవేరా కారు ఢీ; 12మందికి గాయాలు
గుంటూరు: జిల్లాలోని రొంపిచర్ల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఓ లారీ టవేరా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో టవేరా కారులో ప్రయాణిస్తున్న 12మంది గాయపడ్డారు. టవేరా కారులో పెళ్లిబృందం మాచర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.