రూ.1751 కోట్లు ఇదీ రుణ లక్ష్యం
నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖరీఫ్, రబీలో రూ.1751కోట్ల పంట రుణాలను రైతులకు అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. అందులో ఖరీఫ్‌లో రూ.1226 కోట్లు, రబీలో రూ.525 కోట్లను బ్యాంకర్లు పంట రుణాలుగా అందించనున్నారు. గత ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1011 కోట్లకు రూ.1041 కోట్లు అందజేశారు. లక్ష్యానికి మించి మరో రూ. 30కోట్లను అదనంగా ఇచ్చారు. గత రబీలో రూ.433 కోట్ల లక్ష్యానికి రూ. 464 కోట్లు అందజేశారు. అంటే లక్ష్యానికి మించి అదనంగా రూ. 31 కోట్లను రైతులకు పంటరుణాలను బ్యాంకర్లు అందజేశారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5లక్షల 6 వేల 826 హెక్టార్లకు 6లక్షల 2వేల 799 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. అత్యధికంగా పత్తి, వరి పంటలు సాగయ్యాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో సుమారు 6లక్షల 50వేల హెక్టార్లలో పంటలను సాగు చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. దీనికి అనుగుణంగా పంటరుణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, ప్రస్తుతం రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యం మేరకు పంటరుణాలను అందిస్తాయా.. లేదా అనేది అనుమాన మే. వరుస కరువుతో కటకటలాడుతున్న అన్నదాతలకు సకాలంలో లక్ష్యానికి మించి పంట రుణాలను అందించి ఆదుకోవాలని పలువురు రైతులు బ్యాంకర్లను కోరుతున్నారు.