రూ. 2 కోట్ల విలువైన మద్యం విక్రయాలు
వేడుక చేసుకున్నారు
కుత్బుల్లాపూర్: శివారు ప్రాంతంలో ఒకే రోజు రూ. 2 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తం ఎక్సైజ్ పోలీసుల నుంచి ఆరుగురు నిర్వాహకులు అనుమతులు తీసుకోగా బార్లు, వైన్‌షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31 రాత్రి సంబరాల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, బార్లలో యువ త వేడుక చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు చేపట్టడంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.
88 మందిపై కేసు నమోదు..
ఒక వైపు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండగా మరో వైపు తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సంబరాలకు అడ్డుచెప్పని ట్రాఫిక్ పోలీసులు ఆ తర్వాత బాలానగర్‌లో సీఐ రాములు, సూరారంలో జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వేణుగోపాల స్వామి, పేట్ బషీరాబాద్‌లో అల్వాల్ ట్రాఫిక్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహించారు. మూ డు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 88 మందిపై కేసులు నమోదు చేశారు.
రికార్డు స్థాయిలో ..
మూడు రహదారులకు అనుసంధానంగా ఉన్న బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ పరిధిలో 2014 ఏడాది మొత్తంమీద డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడ్డ వారిపై 2808 కేసులు నమోదు కాగా వీరిలో 854 మందిని జైలుకు పంపిన ఘనత వీరికే దక్కింది. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని జైలుకు పంపిన ఏసీపీ జోన్ బాలానగర్ కావడం విశేషం. మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండాలని, ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్రాఫిక్ ఏసీపీ శ్యామ్‌సుందర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.