కోటేషన్ నుంచే మాముళ్లు షురూ
షోరూంల దగ్గర నుంచే దందా మొదలు
ఆర్టీవో పనులకు అదనపు వసూళ్లు
షోరూం నిర్వాహకులతో ఆర్టీఏ సిబ్బంది కుమ్మక్కు
వాహనదారులపై అదనపు భారం
సాక్షి, హన్మకొండ : సిబ్బంది పని భారం తగ్గించడం, సేవలు సుళువుగా పొందేందుకు వీలుగా నూతన వాహనం కొనుగోలు సమయంలోనే రిజిస్ట్రేషన్, హై సెక్యూరిటీ నెంబర్ పేట్ పొందేందుకు వీలుగా షోరూంల్లోనే తగిన రుసుము చేల్లించి రశీదు పొందే విధానాన్ని ఇటీవల రవాణాశఖ ప్రవేశపెట్టింది. ఈ నూతన పద్దతిని వాహన షోరూం యాజమాన్యాలు, అక్కడ పని చేసే సిబ్బంది ఆర్టీవో సిబ్బందితో కలిసి తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్రమ ఆదాయానికి మార్గంగా ఎంచుకున్నారు. దీంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. తాత్కాలిక రిజిష్ట్రేషన్, శాశ్వత రిజిష్ట్రేషన్, నంబరు ప్లేట్లకు సంబంధించి వివిధ వాహనాలకు రవాణా శాఖ నిర్ధేశించిన ఫీజు కంటే రెండు నుంచి నాలుగు రెట్లు షోరూముల్లో అధికంగా వసూలు చేస్తున్నారు. రిజిష్ట్రేషన్లకు సంబంధించిన కంప్యూటర్ బిల్లులు ఇవ్వాల్సి ఉండగా తెల్లకాగితాలపై రాసి ఇస్తున్నారు. ద్విచక్ర, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు తదితర వాహనాలకు చెందిన షోరూములు జిల్లాలో 69 ఉన్నాయి. తొంభైశాతానికి పైగా షోరూముల్లో ఈ అదనపు వసూళ్ల దందా నిరాటంకంగా కొనసాగుతోంది. దీన్ని అరికట్టాల్సిన రవాణాశాఖ అధికారులు ఈ వ్యవహరానికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో రవాణాశాఖలో పని చేస్తోన్న ఉన్నతాధికారి అండదండల కారణంగానే ఈ దందా అడ్డుఅదుపు లేకుండా కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి.
- వాహనదారుడు ఫీజు, యూజర్ చార్జీలతో తాత్కాలిక, శాశ్వత రిజిష్ట్రేషన్‌కు చెల్లించాల్సిన ఫీజు వివరాలు (రూపాయల్లో)
వాహనాలు తాత్కాలిక శాశ్వత
ద్విచక్రవాహనం 80 395
త్రీ, ఫోర్ వీలర్లు 150 400
లైట్ కమర్షియల్ 200 700
మీడియం గూడ్స్, పాసింజర్ వాహనం 250 635
హెవీ గూడ్స్, పాసింజర్ వాహనం 350 800
రిజిష్ట్రేషన్‌లో ఇలా
షోరూముల్లో జరుగుతున్న అదనపు వసూళ్లకు సంబంధించి ద్విచక్ర వాహనాల తాత్కాలిక రిజిష్ట్రేషన్ ఫీజు 80, శాశ్వత రిజిష్ట్రేషన్ ఫీజు 395లను కలుపుకుని రూ. 475లకు వాహనం కొనుగోలు సమయంలో షోరూం సిబ్బందికి చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవంలో ఇంతకు రెట్టింపు ముట్టచెప్పాల్సి వస్తోంది. వివిధ వాహనాల షోరూముల్లో ఒక ద్విచక్ర వాహనానికి కనీసం రూ. 800ల నుంచి రూ. 1500ల వరకు వసూలు చేస్తున్నారు. ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు వంటి వాహనాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన «ఫీజు కంటే నాలుగు రెట్లు అధికంగా వసూళ్లు చేస్తున్నారని వాహనదారులు తెలుపుతున్నారు.
సెక్యూరిటీ దోపిడి
హై సెక్యూరిటీ ప్లేట్లకు సంబం«ధించి ప్రభుత్వం నిర్ణయించిన «ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. మాటల గారడీలు చేస్తూ వాహనం కొనుగోలు చేసే వ్యక్తులను తప్పుతోవ పట్టిస్తున్నారు. సరైన కంప్యూటర్ బిల్లు చేతిలో పెట్టకుండా లెటర్ ప్యాడ్‌పై రాసి ఇచ్చే పద్దతిని కొనసాగిస్తున్నారు. ద్విచక్రవానానికి మొత్తం రూ. 245 లు తీసుకోవాల్సి ఉండగా వివిధ షోరూములు నంబర్ ప్లేట్లకు గరిష్టంగా రూ.1100లు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఆటోలు, కార్లు , లారీలు వంటి వాహనాలకైతే ఈ వసూళ్లు భారీ స్థాయిలో ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
రవాణాశాఖ నిర్ణయించిన ఫీజులు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ధరలు (రూపాయల్లో).
- ద్విచక్రవాహనం 245
- త్రీవీలర్ 282
- లైట్ మోటర్ వాహనాలు 619
(అద్దానికి స్టిక్కర్‌తో సహా)
-ఇతర వాహనాలకు ఆద్దాలతో సహా 649