Iswaran: బాబు సింగపూర్ పార్ట్నర్ రాజీనామా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడిగా, సింగపూర్ పార్ట్నర్గా పేరొందిన సుబ్రమణియం ఈశ్వరన్.. బాబు బాటలోనే పయనిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంట్ సభ్యత్వానికి, అలాగే పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి (PAP)కి సైతం రాజీనామా సమర్పించారు. అవినీతి కేసులో సింగపూర్ మంత్రి పదవికి ఈశ్వరన్ రాజీనామా చేసి.. జైలుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.
సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(CPIB) ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కిందటి ఏడాది జులై 11వ తేదీన ఆయన్ని అరెస్ట్ కూడా చేసింది(వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చారు). ఇక దర్యాప్తు నేపథ్యంలో.. సింగపూర్ ప్రధాని, ఈశ్వరన్‌ను సెలవుల మీద పక్కకు పెట్టారు. మరోవైపు గతేదాడి సెప్టెంబర్‌లో ఈ కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో సింగపూర్ పార్లమెంట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై సస్పెన్షన్వేటు వేసింది. తాజాగా నేరారోపణలు నమోదు కావడం, ఆ వెంటనే సీపీఐబీ నుంచి నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరన్ రాజీనామాను ధృవీకరిస్తూ గురువారం సింగపూర్ ప్రధాని కార్యాలయం ఆ దేశ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: చిక్కుల్లో ఈశ్వరన్.. కేసు నేపథ్యం ఇదే!
భారీ అక్రమ లావాదేవీలు నడిపారన్న అభియోగాలతో ఈశ్వరన్‌పై గురువారం న్యాయస్థానంలో 27 రకాల నేరారోపణల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి దర్యాప్తు సంస్థ సీపీఐబీ కూడా నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. 2025లో సింగపూర్‌లో ఎన్నికలు ఉండడంతో అక్కడి ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణిస్తూ వస్తోంది. తాజా రాజీనామా పరిణామంతో.. గత ఐదు నెలలుగా ఆయన మంత్రి పదవితో పాటు ఎంపీ హోదాలో అందుకున్న జీతభత్యాల్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
చంద్రబాబుతో లింకేంటీ?
చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించారు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించారు.
Delighted to have met Second Minister (Trade & Industry) S. Iswaran on opportunities in AP. pic.twitter.com/s8kf19f00g
— N Chandrababu Naidu (@ncbn) November 12, 2014
అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న నాడు సింగపూర్ వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు.
అమరావతి పేరుతో అంతర్జాతీయ నాటకం..
రాష్ట్ర విభజన సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని సింగపూర్ ప్రభుత్వ సహకారంతో దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నూతన నగరాన్ని నిర్మిస్తానంటూ నమ్మబలికారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై వందిమాగధులకు లీకులిచ్చి భారీ ఎత్తున భూములను కాజేశారు. ఆ తర్వాత తాపీగా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను ముందు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ అందరినీ మభ్యపుచ్చారు. ఈ క్రమంలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ముసుగులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిపి రూ.లక్ష కోట్లు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారు.
సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం అన్నట్లుగా..
రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలు అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు.
ఈ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టులో పెట్టుబడి సహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కలిసి 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా గ్రాస్ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని నాటి చంద్రబాబు కేబినెట్ అంగీకరించింది. ఈ ముసుగులో రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి స్కెచ్ వేశారు.
అక్రమాల ఒప్పందం రద్దు..
2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ అక్రమాల ఒప్పందం రద్దు అయింది.
బాబు తరహా మనిషే!
సుబ్రమణియం ఈశ్వరన్ వ్యవహార శైలిపై మొదటి నుంచే విమర్శలు ఉన్నాయి. ఈశ్వరన్ 1997లో తొలిసారి అక్కడి ఎన్నికల్లో నెగ్గారు. ఆపై 2021లో రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యలో ప్రధాని కార్యాలయంతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. అయితే.. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. మన దగ్గర సీఎంగా చంద్రబాబు చేసిన అవినీతి పుట్ట ఎలాగైతే సీఐడీ దర్యాప్తు ద్వారా బద్ధలయ్యిందో.. సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సింగపూర్ దర్యాప్తు సంస్థ సీపీఐబీ నిర్ధారించింది. ఇక ఈ కేసులో ఈశ్వరన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్ బెంగ్ సెంగ్ సైతం సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో హూంగ్ బెంగ్‌ను సైతం దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ చేసి విచారించింది.