సదాబహార్’ మొక్కలకు మంచి గిరాకీ
సాగుబడి కథనానికి విశేష స్పందన!
♦ మామిడి మొక్కలు తెచ్చి సికింద్రాబాద్‌లో రైతులకు అందించిన రైతు శాస్త్రవేత్త కిషన్ సుమన్
ఏడాదిలో మూడు రుతువుల్లో పండ్ల దిగుబడినిచ్చే అరుదైన సదాబహార్ మామిడి పొట్టి వంగడంపై జూన్ 20న సాక్షి ‘సాగుబడి’లో ‘ఏడాదంతా కాసే మామిడి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక రైతులు, ఇంటిపంటల సాగుదారుల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది.
ఈ వంగడం రూపకర్త, రాజస్థాన్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త కిషన్ సుమన్‌కు, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్.ఐ.ఎఫ్.)కు, సికింద్రాబాద్ సైనిక్‌పురిలోని ‘పల్లెసృజన’ సంస్థను వందలాది మంది సాగుబడి పాఠకులు ఫోన్ చేసి ఈ మామిడి మొక్కలు కావాలని అడిగారు. దక్షిణాది రాష్ట్రాల రైతుల నుంచి తొలిసారి అద్భుతమైన స్పందన రావడంతో కిషన్ సుమన్ సంతోషం వ్యక్తం చేశారు.
200 మొక్కలను జాగ్రత్తగా ఏసీ వాహనంలో పెట్టుకొని స్వయంగా ఈ నెల 12వ తేదీన పల్లెసృజన కార్యాలయానికి వచ్చి, రైతులకు పంపిణీ చేశారు. వారి సందేహాలకు సమాధానాలిచ్చారు. రైతుశాస్త్రవేత్త, ఎన్.ఐ.ఎఫ్., పల్లెసృజన సమన్వయంతో పనిచేయడం వల్ల 15 రోజుల్లోనే రాజస్థాన్ నుంచి మామిడి మొక్కలు రైతులకు అందాయి. ఈ మొక్కలు కావాలని పల్లెసృజనకు ఇప్పటికీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. 200 మొక్కల ఆర్డర్ వచ్చిన తర్వాత తెప్పించి, రైతులకు అందజేస్తామని పల్లెసృజన అధ్యక్షులు బ్రిగేడియర్ గణేశం తెలిపారు. వివరాలకు.. సుభాష్ చందర్(పల్లెసృజన)ను 040–27111959, 96528 01700 నంబర్లలో సంప్రదించవచ్చు.