కళ్లుచెదిరే వాస్తవాలు!
– 'సదరం'లో సడేమియాకు చెక్
– కంప్యూటర్ ఆపరేటర్ సస్పెండ్
– ఐదుగురిపై కేసు నమోదుకు రంగం సిద్ధం
– ఇక నుంచి ప్రతి రోజూ దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం మెడికల్ : వికలత్వ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాల పరంపర కొనసాగింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కొందరు ఉద్యోగులు ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగినై సర్టిఫికెట్లు జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఒకరిని సస్పెండ్ చేయగా.. మరో ఐదుగురిపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైంది. వివరాలు.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నిర్వహించే సదరం శిబిరాల్లో ప్రతి గురువారం ఆర్థో, బుద్ధిమాంద్యత, ప్రతి శనివారం అంధత్వ, చెవిటికి సంబంధించి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
ఈ క్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సర్వజనాస్పత్రిలోని కొందరు ఉద్యోగులతో పాటు దళారులు రంగప్రవేశం చేసి సర్టిఫికెట్ల పేరుతో దందా కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న 'సదరం'గం.. 26న 'సదరం'లో సడేమియా! శీర్షికలతో 'సాక్షి' కథనాలు ప్రచురించింది. స్పందించిన అధికారులు విచారణ చేపట్టగా వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న డీఆర్డీఏ ఉద్యోగి శ్రీధర్ అనుమతులు లేకుండా నెలన్నర వ్యవధిలో 850 మందికి సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించారు. అదేవిధంగా హిందూపురం ఆస్పత్రిలో కూడా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐదుగురిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దీనిపై సమగ్ర నివేదికను కలెక్టర్ కోన శశిధర్‌కు ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
రెండు వారాల్లోనే..
ఇన్నాళ్లూ వారంలో రెండురోజులు మాత్రమే సర్వజనాస్పత్రిలో దరఖాస్తుల స్వీకరణ జరిగేది. అయితే శుక్రవారం నుంచి ప్రతిరోజూ స్వీకరించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం సర్వజనాస్పత్రిలో సదరం శిబిరాన్ని పరిశీలించిన పీడీ వెంకటేశ్వర్లు సర్టిఫికెట్ల కోసం వచ్చిన వారితో మాట్లాడారు. ఆ తర్వాత ఆర్థో, మానసిక వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో మానసిక వైద్య నిపుణుడు యండ్లూరి ప్రభాకర్ నకిలీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై పీడీ దృష్టికి తెచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్టిఫికెట్ల కోసం ఎవరూ దళారులను ఆశ్రయించొద్దన్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని తిరస్కరించిన వారు కూడా మళ్లీ రావద్దని సూచించారు.