ఆ అలవాటు పోవాలంటే...
సందేహం
నా వయసు 16. మెచ్యూరై ఎనిమిది నెలలు అవుతోంది. మొదట్లో రెండు నెలలకు ఓసారి పీరియడ్స్ వచ్చినా, ఎక్కువ నొప్పి ఉండేది కాదు. కానీ ఇప్పుడు తీవ్ర కడుపు నొప్పితో నెలకోసారి పీరియడ్ వస్తోంది. అయితే నాకు సంవత్సరం కాలంగా స్లేట్ పెన్సిల్స్ (బలపాలు) తినడం అలవాటైంది. ఎంత ప్రయత్నించినా ఆ అలవాటును మానుకోలేక పోతున్నాను. బలపాలు తినడం వల్లే నొప్పి వస్తోందా? వాటిని తినడం వల్ల నులిపురుగులు కూడా వస్తాయా? ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా?
- నీరజ, హనుమకొండ
మెచ్యూరైన తరువాత కొందరిలో హార్మోన్స్ సక్రమంగా పనిచెయ్యడానికి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల సమయం పట్టవచ్చు. దానివల్ల ఆ సమయంలో పీరియడ్స్ సక్రమంగా ఉండకపోవచ్చు. వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు దాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు.
పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. అవి విడుదలయ్యే మోతాదును బట్టి గర్భాశయం కండరాలు కుదించుకుని బ్లీడింగ్ బయటకు రావడం వల్ల కొందరిలో కడుపు నొప్పి వస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి నొప్పి తీవ్రత ఉంటుంది. ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే, నొప్పి ఉన్న రోజులలో రోజుకు రెండు చొప్పున నొప్పి నివారణ మాత్రలు వాడవచ్చు. నెలకి రెండు రోజులు నొప్పి మాత్రలు వాడడం వల్ల ప్రమాదం ఏమీలేదు.
కొందరిలో గర్భాశయంలో గడ్డలు, అండాశయంలో సిస్ట్లు వంటి ఇతర సమస్యలు ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. అశ్రద్ధ చేయకుండా ఒకసారి స్కానింగ్ చేయించుకొని, గర్భాశయంలో కాని, అండాశయాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు.
రక్తం తక్కువ ఉన్నప్పుడు బలపాలు, చాక్‌పీస్‌లు, బియ్యం వంటివి తినాలని అనిపిస్తుంది. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల, అవి శరీరం లోపల రక్తాన్ని పీల్చుకోవడం వల్ల రక్తం తగ్గి బలపాలు తినాలనిపిస్తుంది. కాబట్టి ఒకసారి రక్తం ఎంత ఉందో complete blood picture (cbp) పరీక్ష చేయించుకొని రక్తం తక్కువ ఉంటే, పెరగడానికి ఆకుకూరలు, పప్పులు, పండ్లు, మాంసాహారంతో పాటు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. అలాగే నులి పురుగులకు ఆల్బెండజోల్ మాత్ర ఒక్కటి తీసుకోవచ్చు.
రక్తం తక్కువ ఉన్నప్పుడు బలపాలు, చాక్‌పీస్‌లు, బియ్యం వంటివి తినాలని అనిపిస్తుంది. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల, అవి శరీరం లోపల రక్తాన్ని పీల్చుకోవడం వల్ల రక్తం తగ్గి బలపాలు తినాలనిపిస్తుంది.
నా వయసు 24. పెళ్లై ఇంకా సంవత్సరం కాలేదు. అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. దాంతో సేఫ్టీ డేస్‌లోనే కలుస్తున్నాం. అయినా ఏ మూలో భయంగానే ఉంటోంది. ఆ రోజుల్లో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండానే రోజుకు రెండు మూడుసార్లు కలుస్తుంటాం. ట్యాబ్లెట్స్ వాడాలంటే భయంగా ఉంది, ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోనని. సేఫ్టీ డేస్‌లో కలిస్తే సేఫేనా అన్న విషయాన్ని దయ చేసి చెప్పండి. అలాగే.. కలవడానికి డే టైం, నైట్ టైంలో కూడా ఏమైనా తేడాలుంటాయా తెలపండి.
- ఓ సోదరి
నెలనెలా క్రమంగా పీరియడ్స్ వచ్చే వారిలో పీరియడ్స్ మొదలైన మొదటిరోజు నుంచి లెక్కపెడితే పదో రోజు నుంచి పదహారో రోజు మధ్యలో అండం విడుదలవుతుంది. ఆ సమయంలో కలయిక జరిగితే, వీర్యకణాలు అండంతో కలిసి గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. అండం విడుదలైన తర్వాత కేవలం 24 గంటలు మాత్రమే అది చురుగ్గా ఉంటుంది. వీర్యకణాలు 48 గంటల వరకు చురుగ్గా ఉంటాయి. కాబట్టి నెలసరి మొదలైన 9వ రోజు నుంచి 18వ రోజు వరకు గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భం వద్దనుకునే వాళ్లకు ఇది అన్‌సేఫ్ పీరియడ్. ఈ సమయంలో కలవాలంటే కండోమ్స్ జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ కండోమ్స్ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మిగతా రోజులలో గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి వాటిని సేఫ్ పీరియడ్‌గా పరిగణిస్తారు. కానీ పీరియడ్స్ సక్రమంగా రాని వారిలో సేఫ్ పీరియడ్ పద్ధతిని పాటించడానికి ఉండదు. ఎందుకంటే అలాంటి వారిలో అండం ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. సక్రమంగా పీరియడ్స్ వచ్చే వారిలో కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా హార్మోన్ల తేడా వల్ల ఒక నెలలో అండం విడుదల ముందుగా లేదా ఆలస్యంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు సేఫ్ పీరియడ్‌లో కలిసినా కూడా గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. కలవడానికి రాత్రి, పగలు అని సమయం లేదు. వారి వారి వీలునుబట్టి, మూడ్‌ని బట్టి ఎప్పుడైనా ఫర్వాలేదు.
టెంపరరీ ఫ్యామిలీ ప్లానింగ్ విధానాలలో ట్యాబ్లెట్లు మాత్రమే కాక ఇతర మార్గాలూ ఉన్నాయి. మీరు డాక్టర్‌ను సంప్రదించి అనువైన పద్ధతిని పాటించండి.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్