ఘనంగా సాహితీ సందీప్తి’పుస్తకావిష్కరణ
రాజమహేంద్రవరం కల్చరల్ :
పద్యమే తెలుగుజాతికి శ్రీరామరక్ష అని త్రికరణశుద్ధిగా నమ్మిన యువ కవి తాతా శ్రీనివాస రమాసత్య సందీప్ అని ‘రాధికాప్రియ’ శతక కర్త మంగళంపల్లి పాండురంగ విఠల్ అన్నారు. పద్య సారస్వత పరిషత్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీహాల్లో సందీప్ రచించిన ‘సాహితీ సందీప్తి’ పుస్తకాన్ని ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి శనివారం ఆవిష్కరించారు. సభకు ‘ప్రజ్ఞారాజహంస’ చింతలపాటి శర్మ అధ్యక్షత వహించారు. డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, ఆదిత్య కళాశాలల ౖడైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, భాష్యం కళాశాలల తెలుగు పండితుడు గొర్ల ఏసురాజు, పరిషత్ ప్రధాన కార్యదర్శి ఓలేటి బంగారేశ్వర శర్మ, శతావధాని డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, సరసకవి డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు తదితరులు తాతాసందీప్కు పద్యరూపకాలతో ఆశీస్సులు అందించారు. రొటేరియన్ పట్టపగలు వెంకట్రావు జ్యోతి ప్రకాశనం చేశారు. తొలిప్రతిని సంగీత విద్వాంసుడు తాతా రామజోగి శర్మ స్వీకరించారు. ప్రముఖ గేయకవి జోరాశర్మ స్వాగత వచనాలు పలికారు. నీలోత్పలకవి యార్లగడ్డ మోహనరావు వందన సమర్పణ చేశారు. అనంతరం తాతా సందీప్‌ను సత్కరించారు. భారత భారతి శలాక రఘునాథశర్మ, పెరుమాళ్ల రఘునాథ్, బీవీ రమాదేవి, డీవీ హనుమంతరావు హాజరయ్యారు.