సెయిల్ఫిష్ ఓఎస్‌తో ఇంటెక్స్ వచ్చేసింది
ప్రపంచంలోనే మొట్టమొదటి సెయిల్ఫిష్ ఆపరేటింగ్ సిస్టమ్ డివైజ్ ను ఇంటెక్స్ శుక్రవారం విడుదల చేసింది. ఆక్వా ఫిష్ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,499గా ఇంటెక్స్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా ఈబే ఇండియా ప్లాంట్ ఫామ్‌పై ఉంచినట్టు పేర్కొంది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఫిన్లాండ్ కంపెనీ జొల్లాకు చెందిన సెయిల్ఫిష్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతున్నామని, దీనికోసం జొల్లాతో ఒప్పందం కుదుర్చుకున్నామని గతేడాది జూన్‌లో షాంఘై ఎమ్డబ్ల్యూసీలో ఇంటెక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ టెక్నాలజీలను కస్టమర్ల ముందుకు తీసుకురావడానికి తాము నిరంతరం ప్రయత్నిస్తుంటామని, ఈ నేపథ్యంలోనే సెయిల్ఫిష్ ఓఎస్‌తో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశామని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ కేశవ్ బన్సాల్ తెలిపారు. సెయిల్ఫిష్ యంగ్ మొబైల్ ఓఎస్ అని, సెయిల్ఫిష్ అనుభూతిని కస్టమర్లు ఆస్వాదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ఓఎస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లకు కూడా సపోర్టు చేస్తుందన్నారు. సెయిల్ఫిష్ ఓఎస్ తో ఆక్వాఫిష్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడం చాలా గర్వకారణంగా ఉందని జోలా సహ వ్యవస్థాపకుడు సామి తెలిపారు.
ఇంటెక్స్ ఆక్వా ఫిష్ ఫీచర్లు..
డ్యూయల్ సిమ్ సపోర్టింగ్
5 అంగుళాల హెచ్డీ రిసుల్యూషన్ టీఎఫ్టీ డిస్ప్లే
1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
2 జీబీ ఆఫ్ డీడీఆర్3 ర్యామ్
8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
2 మెగాపిక్సెల్ ముందు కెమెరా
16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
32జీబీ విస్తరణ మెమరీ
4జీ ఎల్టీఈ
150 గ్రాముల బరువు
2500ఎంఏహెచ్ బ్యాటరీ
బ్లాక్, ఆరెంజ్ రంగుల్లో ఫోన్ లభ్యం