ఖరీదైన శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: శామ్సంగ్ ఇండియా... నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ను, స్మార్ట్ వాచ్-గెలాక్సీ గేర్లను భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. నోట్ 3 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.49,900గా, గెలాక్సీ గేర్ ధరను రూ.22,990గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. వీటి అమ్మకాలు ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తామని వివరించింది. పండుగల సీజన్ కారణంగా పలు బై బ్యాక్ స్కీమ్‌లను అందించనున్నామని ఈ సందర్భంగా పేర్కొంది.
సులభ వాయిదాల్లో నోట్ 3
నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ను 12 సులభవాయిదాల్లో కూడా కొనుగోలు చేసే అవకాశాన్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. శామ్సంగ్ కంపెనీ నుంచి వస్తోన్న అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇదే. భారత్‌లో ఈ ఫోన్‌ను 3జీ వెర్షన్లో అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఒకేసారి మల్టిఫుల్ ఫ్రేమ్స్‌ను యూజర్లు ఓపెన్ చేసుకునేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశామని వివరించింది. 5.7 అంగుళాల సూపర్ అమెలెడ్ స్క్రీన్, స్టైలస్(ఎస్ పెన్), 13 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, అదనపు మెమరీ కోసం మైక్రో ఎస్డీ కార్డ్ వంటి ప్రత్యేకతలున్నాయి. డేటాను సురక్షితంగా ఉంచే కంటైనర్ ఫోల్డర్ (శామ్సంగ్ నాక్స్ ఆప్సన్ ద్వారా ఇది పనిచేస్తుంది) ఈ ఫోన్ ప్రత్యేకతని కంపెనీ వివరించింది. ఒక వేళ ఫోన్ పోతే, దాంట్లో ఉన్న డేటాను నాక్స్ ఫీచర్‌తో తొలగించడం కానీ, ట్రాక్ చేయడం గానీ చేయవచ్చని పేర్కొంది. 3200 ఎంఏహెచ్ బ్యాటరీ 24 గంటల బ్యాకప్‌ను ఇస్తుందని వివరించింది.
గెలాక్సీ గేర్ ప్రత్యేకతలు...
1.6 అంగుళాల స్క్రీన్, 2.6 ఔన్స్‌ల బరువు, 1.9 మెగా పిక్సెల్ కెమెరా, యూజర్లు హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ చేసుకోవడానికి బిల్టిన్ స్పీకర్, మెసేజ్‌లు పంపించడం వంటి పనులను ఈ వాచీ నిర్వర్తిస్తుంది. నడిచేటప్పుడు అడుగులు లెక్కించే స్టెప్-కౌంటింగ్ పెడో మీటర్, ఎస్ వాయిస్‌లతో సహా మొత్తం 60యాప్‌లు ప్రి లోడెడ్‌గా ఈ వాచ్ లభిస్తుంది. ఈ వాచ్‌తో తీసిన వీడియోలను, ఫొటోలను బ్లూటూత్ ద్వారా గెలాక్సీ నోట్ 3 వంటి మొబైల్ డివైస్‌లకు ట్రాన్సిమిట్ చేసుకోవచ్చు.