శామ్సంగ్ నుంచి కొత్త జడ్1 స్మార్ట్‌ఫోన్
స్మార్ట్ ఫోన్లలో అగ్రగామిగా ఉన్న శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ టైజెన్ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన తొలి స్మార్ట్ ఫోన్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇన్నాళ్లూ గూగుల్ ఆండ్రాయిడ్ మీదే ఆధారపడిన శామ్సంగ్.. తొలిసారి తన సొంత ఓఎస్‌తో ఫోన్ విడుదల చేసింది. జడ్1 ఫోన్లు భారతదేశంలో బుధవారం నుంచే అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర రూ. 5,700. తొలిసారి స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునేవాళ్లు లక్ష్యంగా వీటిని మార్కెట్లోకి దించినట్లు తెలుస్తోంది.
ఇందులో 4 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ప్లాస్టిక్ బాడీ కలిగి ఉంటుంది. మరే ఇతర దేశంలోనూ ఇంకా ఈ ఫోన్లను విడుదల చేయలేదు. టైజెన్ స్టోర్‌లో వెయ్యికి పైగా యాప్స్ డౌన్లోడ్ చేసుకోడానికి అందుబాటులో ఉంటాయని శామ్సంగ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే, గూగుల్ ప్లేస్టోర్‌తో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. ఇక ఈ ఫోన్లలో ముందుగానే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, యాహూ, యూట్యూబ్ లాంటివి ఇన్స్టాల్ చేసి ఉంటాయి.