సంతోషంగా దక్షిణ భారత సినీ పురస్కారాల వేడుక
నృత్యతారగా ఒక తరాన్ని ఉర్రూతలూగించిన జయమాలిని దాదాపు 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో కనబడ్డారు. ‘సంతోషం’ సినీవారపత్రిక ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ భారత సినీ అవార్డుల వేడుకలో జయమాలిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహమయ్యాక సంసార బాధ్యతల్లో నిమగ్నమై ఇంటికే పరిమితమైన జయమాలిని తొలిసారిగా పాల్గొన్న సినీ వేడుక ఇదే కావడం విశేషం. అంతేకాదు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వేదికపై నర్తించి, ఆహూతులందరిలో ఆనందాన్ని నింపారు. చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన ఏయన్నార్ స్మారక పురస్కారాల్ని సూపర్‌స్టార్ కృష్ణ (తెలుగు), షావుకారు జానకి (తమిళం), బి.సరోజాదేవి (కన్నడం), అంబిక (మలయాళం) అందుకున్నారు. అలాగే షావుకారు జానకి, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, చంద్రమోహన్, జయమాలిని, అంబికలకు జీవితకాల సాఫల్య పురస్కారాలను అందించారు. ఈ వేడుకలో భాగంగా ‘దర్శకేంద్రుని సినీ స్వర్ణోత్సవ సత్కారం’ పేరిట కె.రాఘవేంద్రరావును ఘనంగా సత్కరించారు.
తెలుగు నుంచి ఉత్తమ చిత్రం పురస్కారాన్ని ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి అందించగా, ఉత్తమనటుడు, ఉత్తమ నటిగా అవార్డులు ఆ సినిమా హీరో హీరోయిన్లు పవన్‌కల్యాణ్, సమంతలను వరించాయి. ఉత్తమ దర్శకుని పురస్కారం ఆ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్‌కు దక్కింది. ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్‌గా ‘సాక్షి’ సీనియర్ సినిమా రిపోర్టర్ డి.జి.భవాని పురస్కారం అందుకున్నారు. ఇంకా దక్షిణాదిలోని నాలుగు భాషలకు చెందిన చిత్రాలకు సంబంధించిన ముఖ్య శాఖలన్నింటికీ ఈ పురస్కారాలందించారు. ‘సంతోషం’ పత్రికాధినేత సురేశ్ కొండేటి ఈ వేడుకను దిగ్విజయంగా నిర్వహించారు.