నవోదయం వచ్చేనా..?
* సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రయత్నం
* జోరుగా చైతన్యం
విజయనగరం రూరల్: సారారహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఎంత కట్టడి చేస్తున్నా నాటుసారా తయారీ, అమ్మకాల జోరు తగ్గడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నాటుసారా తయారీ జోరుగా ఉండడంతో గిరిజన ప్రజల ఆరోగ్యం గుల్లవుతోంది. నాటుసారా అమ్మకాలు, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం ‘నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు 45 రోజుల పాటు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, అటవీశాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలో ర్యాలీలు, విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి సారా రక్కసిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని రాష్ట్ర, జిల్లా సరిహద్దు గ్రామాలు, గిరిజన గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారీ జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా గత ఏడాది జూలై నుంచి జనవరి వరకు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో 109 కేసులు నమోదు చేసి 103 మందిని అరెస్ట్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా 80 కుటుంబాలు నాటుసారా తయారీలో పాలుపంచుకుంటున్నట్లు ఎక్సైజ్ అధికారుల సర్వేలో తేల్చారు. తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో సుమారు నాలుగు వందల మంది ప్రత్యక్షంగా నాటుసారా అమ్మకాల్లో పాలుపంచుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. నాటుసారా తయారీకి ఉపయోగించే లక్ష లీటర్ల బెల్లం ఊటను గత ఏడు నెలల కాలంలో ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలు, అమ్మకందారులను గుర్తించి ఆయా గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు నవోదయం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
చైతన్య కార్యక్రమాలు
జిల్లాలో గుర్తించిన నాటుసారా తయారీదారులను, అమ్మకందారులను అదుపులోకి తీసుకుని అవగాహన కార్యక్రమాలు, కళాజాతాలు నిర్వహించి ఎక్సైజ్, రెవెన్యూ, పోలీసులు వారిచేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. వినకుంటే వారిపై కఠిన చర్యలకు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వారి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఇంటి కరెంట్‌ను రద్దు చేసే యోచనలో ఉన్నారు. జరిమానా ఫీజును సైతం అయిదు రెట్ల వరకు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కమిటీల ఏర్పాటు
నవోదయం కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా సభ్యులుగా ఎస్పీ, డీఎఫ్‌వో, కన్వీనర్‌గా ఎక్సైజ్‌శాఖ సహాయ కమిషనర్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఉంటారు. అలాగే మండల కమిటీలో తహశీల్దార్ చైర్మన్‌గా సీఐ, ఎస్సై, ఎంపీడీవో, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉంటారు. గుర్తించిన గ్రామాల్లో ప్రజలను ఇందులో భాగస్వాములు చేస్తారు.
80 గ్రామాల్లో నవోదయం
జిల్లాలో 30 గ్రామాల్లో సారా తయారీ, 50 గ్రామాల్లో సారా అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నవోదయం కార్యక్రమం అమలు చేస్తున్నారు. విజయనగరం డివిజన్ పరిధిలోని కొత్తవలస ఎక్సైజ్ సర్కిల్, ఎస్.కోట సర్కిల్, నెల్లిమర్ల సర్కిల్, పార్వతీపురం డివిజన్ పరిధిలో పార్వతీపురం, కూనేరు చెక్‌పోస్టు, సాలూరు సర్కిల్లో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. వీటని గ్రేడ్లుగా విభజించి నవోదయం కార్యక్రమం అమలు చేస్తున్నారు.
సారారహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
సారా రహిత రాష్ట్రంలో భాగంగా నవోదయం కార్యక్రమంతో జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం. సారా తయారీ, అమ్మకందారులను అదుపులోకి తీసుకుని వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరుస్తాం. మాట వినని వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.
- వై.చైతన్య మురళి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ