Sarla Thakral
-
చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే!
Google Doodle Sarla Thukral: ఆమె చీర కట్టింది. కాక్‌పిట్‌లో కూర్చుంది. ధైర్యంగా ఎయిర్‌క్రాఫ్ట్ నడిపింది. వెయ్యి గంటల ప్రయాణం తర్వాత దేశంలోనే తొలిసారి ‘ఏ’ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. ఆ టైంకి ఆమె వయసు 21 ఏళ్లు మాత్రమే. అందుకే పైలెట్ సరళ పేరు చరిత్రకెక్కింది. సరళ త(తు)క్రల్.. భారత తొలి మహిళా పైలెట్. ఎయిర్‌క్రాఫ్ట్‌ను.. అదీ సంప్రదాయ చీరకట్టులో నడిపిన మొదటి మహిళా పైలెట్ ఈమె. ఇవాళ (ఆగష్టు 8న) ఆమె 107 జయంతి. అందుకే గూగుల్ ఆమె డూడుల్‌తో గుర్తు చేసింది. సాధారణంగా గూగుల్ డూడుల్ రెండుసార్లు రిపీట్ అయిన సందర్భాలు లేవు. నిజానికి కిందటి ఏడాదే సరళ పేరు మీద డూడుల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ టైంలో కేరళలో విమాన ప్రమాదం జరిగింది. అందుకే ఆ టైంలో సహాయక చర్యలకు గుర్తుగా డూడుల్‌ను నిలిపివేశారు. At the age of 21, Sarla Thukral soared to new heights by taking her first solo flight and becoming India’s first woman pilot 👩✈️ Today's #GoogleDoodle honours this incredible pilot, designer, and entrepreneur, on her 107th birth anniversary. ➡️ https://t.co/5dF5JBxUY2. pic.twitter.com/UBeh7LuJkz — Google India (@GoogleIndia) August 8, 2021 ఈసారి ఆమె మీద గౌరవార్థం 107వ జయంతి సందర్భంగా డూడుల్‌ను ఉంచినట్లు గూగుల్ ప్రకటించింది. ‘వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్ఫూర్తినిస్తూ చరిత్రలో ఆమె ఒక చెరగని ముద్ర వేశారు. అందుకే ఆమె కోసం రెండోసారి డూడుల్‌ని సృష్టించాం’ అని ప్రకటించింది గూగుల్. ఎయిర్‌క్రాఫ్ట్‌లో చీరకట్టులో ఉన్న ఈ డూడుల్‌ను వ్రిందా జవేరీ రూపకల్పన చేశారు. 16 ఏళ్ల వయసుకే పెళ్లి.. సరళ.. 1914లో పుట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్లైంది. ఆమె భర్త పైలెట్. ఆయన స్ఫూర్తితోనే పైలెట్ అవ్వాలనుకుంది. నాలుగేళ్ల పాప ఉండగానే.. 21 ఏళ్ల వయసులో చీర కట్టులో విమానం నడిపి ఏ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. లాహోర్ ఫ్లైయింగ్ క్లబ్ తరపున ఈ ఘనత సాధించాక.. కమర్షియల్ పైలెట్ శిక్షణ కోసం జోధ్‌పూర్ వెళ్లింది. అయితే 1939లో ఆమె భర్త చనిపోవడం, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కమర్షియల్ పైలెట్ కావాలనే కల చెదిరింది. ఆపై లాహోర్‌కు వెళ్లి ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్ కోర్సులు చేసింది. విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆర్పీ త(తు)క్రల్ను వివాహం చేసుకుంది. ఆపై ఆభరణాల డిజైనింగ్, బట్టల డిజైనింగ్ వ్యాపారంతో ఎంట్రప్రెన్యూర్‌గా పెద్ద సక్సెస్ అయ్యింది. 2008లో సరళ తక్రల్ అనారోగ్యంతో కన్నుమూసింది. -
నింగిని గెలిచింది!
ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. జీవితంలో ముందుకు సాగాలంటే... అలా ఉండటం చాలా అవసరం. ఆ లక్షణం నాకు ఉండబట్టే... నేను విషాదాల్లో సైతం నవ్వగలిగాను. పడినప్పుడల్లా లేచి నిలబడగలిగాను - సరళా థక్రాల్ ‘‘ఏవండీ... నాకు కూడా పైలట్ అవ్వాలని ఉంది. చిన్నప్పట్నుంచీ నాకు ఆకాశంలో ఎగరాలని ఆశ.’’1935వ ప్రాంతంలో ఓ మహిళ... ఓ ఇంటి కోడలు... ఒక వ్యక్తికి అర్థాంగి... ఓ బిడ్డకు తల్లి... ఈ మాట అన్నదంటే ఊహించడం కష్టం. ఎందుకంటే మహిళ అంటే గడప లోపల జీవించేది తప్ప గడప దాటి వెళ్లదగినది కాదు అన్న అభిప్రాయం బలంగా పాతుకుపోయిన కాలమది. ఆడదాని ఆశలు మనసు పొరల మాటున ఉండాలే తప్ప మాటల్లో వెలువడకూడదని శాసించిన సమయమది. కానీ అవేవీ సరళ మనసుకు కళ్లెం వేయలేకపోయాయి. ఆమె కోరికను పెదవులు దాటి రాకుండా కట్టడి చేయలేకపోయాయి.అన్నదే కానీ చాలా భయపడింది సరళ. ఒకవేళ భర్త కోప్పడితేనో? తన ఆశను అత్తింటివారు అపార్థం చేసుకుంటేనో? కానీ అలా జరగలేదు. సరళ భర్త పీడీ శర్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కళ్లతోనే అంగీకారం తెలిపారు. మీరేం అంటారు అన్నట్టు భయంభయంగా మామగారివైపు చూసింది సరళ. ‘మన ఇంట్లో మీ ఆయనతో కలిపి ఇప్పటికి తొమ్మిది మంది పైలట్లు ఉన్నారు. నువ్వూ కలిస్తే పదిమంది అవుతారు’ అన్నారా యన నవ్వుతూ. సరళ సంతోషం అంబరానికి ఎగసింది. కన్ను మూసి తెరిచేలోగా ఆమె ఎక్కిన విమానం కూడా అంబరంలో అడుగిడింది. విమానాన్ని నడిపిన తొలి మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో లిఖితమయ్యింది. ఆకాశానికి ఎగిరిన క్షణంలో ఒక్కటే అనుకున్నారు సరళ... ‘ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ ఆడది ఉంటుంది అంటారు. కానీ ఆడదాని విజయం వెనుక మగవాడూ ఉంటాడని తొలిసారి తెలిసి వచ్చింది. నా భర్తే లేకుంటే నా ఈ ఆశ నెరవేరేది కాదు. ఆయన నాతో ఉన్నంత కాలం నా పయనం ఆగదు.’ ఆమె సంతోషం చూసి దేవుడికి కన్ను కుట్టిందో ఏమో... సరళ భర్తని తన దగ్గరకు తీసుకు పోయాడు. ఓ విమాన ప్రమాదంలో సరళ భర్త శాశ్వతంగా ఆమెను వదిలిపోయాడు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ అదే తలచు కుంటూ కుమిలిపోలేదామె. తన భర్త అండతో సాధించిన విజయాన్ని వృథాగా పోనివ్వకూడదనుకున్నారు. కమర్షియల్ పైలట్ లెసైన్సును పొంది తన భర్త ఆశను నెరవేర్చాలనుకున్నారు. కానీ దురదృష్టం ఆమెను మరోసారి వెంటాడింది. రెండో ప్రపంచ యుద్ధం మొదలై సివిల్ ట్రైనింగ్ పూర్తిగా రద్దయ్యింది. ఒక గాయం పూర్తిగా మానకముందే మరో గాయం. ఒక కన్ను తడి ఆరేలోపే మరో కంట కన్నీటి సంద్రం. ఓ పక్క తోడు దూరమైంది. మరోపక్క ఆశ ఆవిరైంది. ఏం చేయాలో తెలియని స్థితిలో చాలాకాలం కొట్టుమిట్టాడారు సరళ. తర్వాత లాహోర్ వెళ్లిపోయారు. ఓ కాలేజీలో చేరి ఫైన్ ఆర్ట్సలో డిగ్రీ సంపాదించారు. వాటర్ పెయిం టింగ్‌తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్, జ్యూయెలరీ మేకింగుల్లో నైపుణ్యం సంపాదించి వాటినే తన జీవన భృతిగా మార్చుకున్నారు. తర్వాత దేశం విడిపోవడంతో తన జన్మస్థమైన ఢిల్లీకి వెళ్లిపోయారు. పి.పి. థక్రాల్ను రెండో వివాహం చేసుకున్నారు. ఇరవై నాలుగేళ్లకే వైధవ్యం వంటి భయంకర విషాదం... ఇరవై ఒక్కేళ్లకే విమానం నడిపిన విజయానందం... ఈ పడటాలూ లేవటాలూ సరళకు చాలా పాఠాలు నేర్పాయి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఉన్నప్పుడు ప్రతి క్షణాన్నీ మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి అని నమ్మారామె. వేసే ప్రతి అడుగూ విజయ తీరాలకే చేరాలని అనుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్‌గా సైతం ప్రత్యేక గుర్తింపు పొందారు. విజయలక్ష్మీ పండిట్ లాంటి మహామహులకి దుస్తులు డిజైన్ చేసేంత ఖ్యాతి గడించారు. 2008 మార్చిలో కన్ను మూసేవరకూ కూడా సరళ విజేతగానే బతికారు, విజేతగానే మిగిలారు! ఠి సరళ భర్త ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కళ్లతోనే అంగీకారం తెలిపారు. మీరేం అంటారు అన్నట్టు భయంభయంగా మామగారివైపు చూసింది సరళ.