కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ
నల్లగొండ, న్యూస్‌లైన్: కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగానే కేంద్రం తెలంగాణను ప్రకటించిందని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. శనివారం పట్టణంలోని ఎస్బీఆర్ గార్డెన్లో జరిగిన పార్టీ నల్లగొండ పట్టణ, మండల స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రావడంతో కిరికిరిలు మొదలయ్యాయని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని భిక్షగా ఇవ్వలేదని, పోరాడితేనే ఇచ్చారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో పోరాటాలు నిర్వహించారని అయినప్పటికీ గాంధీనే కొలుస్తామన్నారు. అదే తరహాలో తెలంగాణ ఉద్యమంలో ప్రపంచ చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతాడన్నారు. రాబోయే తెలంగాణలో విద్యార్థులే కథనాయకులు అవుతారన్నారు.
టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణలోని నీళ్లు, నిధులు, విద్య తదితర అంశాలపై జరుగుతున్న దోపిడీని చూడలేకే కేసీఆర్ తన భుజస్కంధాలపై ప్రత్యేక రాష్ట్ర నినాదమెత్తుకున్నారని, ఆ స్థాయిలోనే వివిధ పార్టీలను సైతం ఢిల్లీ స్థాయిలో కదిలించి తెలంగాణపై మళ్లించారన్నారు.
ధూం... ధాం.. సృష్టికర్త కూడా కేసీఆర్‌నే అన్నారు. హైదరాబాద్ జేఏసీ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని, సంపూర్ణ తెలంగాణ సాధించుకునేవరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నియోకవర్గ ఇన్చార్జ్ చకిలం అనిల్‌కుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన మహిళా సర్పంచ్‌లను సన్మానించారు. సమావేశంలో పార్టీ మహిళా, ఎస్సీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు మాలె శరణ్యారెడ్డి, మైనం శ్రీనివాస్, ఫరీదుద్దీన్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ పుట్టం పురుషోత్తం, జిల్లా, మండల నాయకులు సురేందర్, రామారావు, అభిమన్యు శ్రీనివాస్, సుగుణమ్మ, లింగమ్మ, లింగయ్యగౌడ్, శేఖర్‌గౌడ్, నాగార్జున, మహేందర్నాథ్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.