ఆ పోలీసులపై నమ్మకం పోయింది.. ఇక మీరే
లక్నో: సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నుంచి తనకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు చేసిన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ మరికొద్ది సేపట్లో హోంమంత్రిత్వశాఖ అధికారులను కలవనున్నారు. ఆయన తన భార్య, సామాజిక ఉద్యమకారురాలైన నూతన్ ఠాకూర్‌తో కలిసి అధికారులతో మాట్లాడనున్నారు. ములాయం సింగ్‌పై ఫిర్యాదు చేసిన మరుసటి రోజే పోలీసులు అమితాబ్ ఠాకూర్‌పై లైంగిక దాడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
దీంతో తనపై ములాయం ఉద్దేశ పూర్వకంగానే కక్షపూరిత చర్యలకు దిగారని, తన తప్పులేకుండానే అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం పోయిందని, తమకు కేంద్ర బలగాలతో రక్షణ ఇప్పించాలని ఐజీ దంపతులూ హోమంత్రిత్వశాఖను కోరనున్నారు.
తన మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ములాయం బెదిరిస్తున్నారని ఐజీ ర్యాంకు అధికారి అయిన అమితాబ్ ఠాకూర్ శనివారం కేసు పెట్టారు. దీనికి ప్రతిగా ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఏడు నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అమితాబ్ ఠాకూర్‌పై రేప్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో ఠాకూర్ భార్య నూతన్‌ను కూడా నిందితురాలిగా పేర్కొన్నారు. దీంతో కలత చెందిన దంపతులిద్దరు హోంశాఖను కలవనున్నారు.