పోలీసు వెబ్సైట్లో సీనియారిటీ లిస్టు
800 మంది డీఎస్పీ, అదనపు ఎస్పీల లిస్టులో.. నేడు పదోన్నతులపై నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: డీఎస్పీలు, అదనపు ఎస్పీలకు సంబంధించి సమగ్ర సీనియారిటీ ప్రొవిజినల్ జాబితాను ఏపీ డీపీసీ రూపొం దించింది. జాబితాను పోలీసు వెబ్‌సైట్‌తోపాటు హోంశాఖ సైట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 800 మంది వరకు డీఎస్పీలు, అదనపుఎస్పీల సీనియారిటీ జాబితాను రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి ప్రసాదరావు, డీజీపీ జేవీ రాముడులతోపాటు మరో ఇద్దరు అధికారులున్న డీపీసీ జాబితాను రూపొం దించింది.
రాష్ట్ర విభజన జరిగినా ఇంకా డీఎస్పీలు, అదనపు ఎస్పీ లు, నాన్‌కేడర్ ఎస్పీల కేటాయింపులు జరగలేదు. మున్ముందు పదోన్నతుల సీనియారిటీపై వివాదాలు తలెత్తకుండా జాబితాను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా ఉమ్మడి రాష్ట్రానికి చెందిన అధికారుల లిస్టును పరిగణన లోకి తీసుకుని తయారు చేసిన ఈ సీనియారిటీ జాబితా వల్ల ఇకపై ఏ సమస్య ఉత్పన్నం కాదని అధికారులంటున్నారు. దీన్ని అనుసరించే ఇరు రాష్ట్రాలు అధికారుల సీనియారిటీని కొనసాగించవచ్చని సీనియర్ ఐపీఎస్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అందుబాటులో ఉంచిన ఈ జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలన్నారు. అభ్యంతరాల పరిశీలన జరిగాక బుధవారం పదోన్నతులను కూడా నిర్ణయిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాలవి కలిపి మొత్తం 100 వరకు అదనపు ఎస్పీల పోస్టులు, మరో 25 వరకు నాన్‌కేడర్ ఎస్పీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. జాబితాలో మరణించిన అధికారులతోపాటు పదవీ విరమణ చేసినవారి పేర్లు కూడా ఉన్నాయని, పదోన్నల వేళ తొలగిస్తామని అధికారులు అంటున్నారు.