Sep2
-
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
మహబూబ్నగర్: సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ కమిటీ నాయకులు అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్ నియామకాలు చేసి శ్రమదోపిడిని అరికట్టాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని అన్నారు. 9నెలల పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 2న డిమాండ్స్తో కూడిన బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని తీర్మానించారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేష్, జంగయ్య, డీటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వామన్కుమార్, శ్రీశైలం, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణమ్మ, దేవెంద్రప్ప, టీజీపీఈటీఏ నిరంజన్, టీఎస్పీటీఏ ముజబుర్ రహమాన్, ఎస్టీఎఫ్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
మక్తల్ : కార్మికుల హక్కుల రక్షణకు సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా సహాయకార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సమావేశాలు, బైక్ర్యాలీతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని అన్నారు. అందులో భాగంగానే పట్టణంలోని ఐబీ నుంచి నెహ్రూగంజ్, సంగంబండ, నల్లజానమ్మగుడి, పాతబజార్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. కార్యక్రమంలో ఇప్టూ నాయకులు భుట్టో, శ్రీనివాసులు, రమేష్, రాము, గోపి, రాజు, వెంకటేష్, సజన్, మారెప్ప, దేవప్ప, తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
జడ్చర్ల టౌన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఖమర్ అలీ పిలుపునిచ్చారు. శుక్రవారం బాదేపల్లి నగరపంచాయతీ ప్రాంగణంలో వర్కర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కార్మికులు, పేద ప్రజలకు మేలు చేసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సవరిస్తూ మరింత అన్యాయం చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ అనేక కార్మిక సంఘాలు కలసి చేపట్టిన సార్వత్రిక సమ్మె అన్నిరంగాల కార్మికులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దీప్లానాయక్, నగరపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ నాయకులు వెంకటేశ్, కార్మికులు యాదమ్మ, శివలీల, లక్ష్మి, మొగులయ్య, భారతి, చంద్రయ్య, కష్ణ, బాల్వెంకట్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.