'చిల్లర రాజకీయాలతో చిచ్చు పెట్టొద్దు'
విజయవాడ: ఆలయాల కూల్చివేతలపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేసి మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని బీజేపీ నేతలను కోరారు. ఆదివారం మధ్యాహ్నం కేశినేని నాని విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ నాయకులపై మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో వదంతులు సృష్టించి ఉద్రికత్తలు రేపుతున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నారని అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో వందల ఆలయాలు తొలగించారని తెలిపారు. ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే 80 గుళ్లను తొలగించారని వెల్లడించారు. అక్కడ చేస్తే ఒప్పు, ఇక్కడ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. ప్రజలను ఒప్పించి అభివృద్ధి కోసం ఆలయాలను తొలగిస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలకు చేతనైతే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధించురావాలని సూచించారు. 'హిందూ మత పరిరక్షణ మీరొక్కరో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వొద్దు' అంటూ బీజేపీ నేతలపై కేశినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు, సీఎం చంద్రబాబు అన్ని కులాలు, మతాలను సమానంగా చూస్తున్నారని చెప్పారు. తమ మీద పెత్తనం చెలాయిస్తే ఊరుకోమన్నారు.