కేంద్ర సాయంపై తప్పుడు ప్రచారం
- ప్రత్యేక హోదా వద్దని అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి
- బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్దార్థనాథ్ సింగ్
అనంతపురం సెంట్రల్
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాయం చేస్తున్నా దుష్ర్పచారం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. అనంతపురంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాలులో రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో యూపీఏ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇటీవల 14వ ఆర్థిక సంఘం చట్టానికి దేశంతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు 30 శాతం నుంచి 40 శాతానికి పెరిగాయన్నారు. అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలనే ఉద్దేశంతోనే భవిష్యత్‌లో ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేకహోదా కలిగిన 11 రాష్ట్రాలకు 2017తో పూర్తవుతుందని వివరించారు. భవిష్యత్‌లో ప్రత్యేకహోదా అంటూ ఉండదని స్పష్టం చేశారు. ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయన్నారు. కానీ రాష్ట్రానికి వచ్చే సరికి కేంద్రం అన్యాయం చేస్తోందని దుష్ర్పచారం చేయడం భావ్యం కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా లేకపోయినా రెవెన్యూ లోటును అధిగమించడానికి రూ. 80 వేల కోట్లకు పైగా నిధులు విడుదలవుతాయని వెల్లడించారు. ఇవి కాకుండా 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రూ. 3 వేల కోట్లు అడిగితే రూ. 1000 కోట్లు మాత్రమే ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోందన్నారు. నిధులు విడుదల చేసిన తర్వాత దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంటుందన్నారు. తొలుత నిధుల ఖర్చుకు సంబంధించిన వివరాలను కేంద్రానికి తెలియజేయాలని, ఆ తర్వాత మరిన్ని నిధులు కావాలని అడగాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.