వేలంలో రూ. 15 లక్షలు పలికిన కుక్క!
గొర్రెలను కాసేందుకు వాటి పెంపకందారులు ఉపయోగించే ఒక కుక్క.. బ్రిటన్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. వేలంలో దాన్ని ఏకంగా దాదాపు రూ. 15 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. డెనెగల్ కౌంటీలో పెరిగిన ఈ 16 నెలల కుక్కను ఉత్తర యార్క్‌షైర్‌లోని స్కిప్టన్లో వేలం వేస్తే ఈ కళ్లు తిరిగే ధర పలికింది. దీనికి మహా అయితే రూ. 2 లక్షల వరకు వస్తుందని భావించానని, కానీ చాలా మంచి రేటు వచ్చిందని కుక్క అసలు యజమాని పాడ్రైగ్ డోహెర్టీ ఆనందపడ్డారు. ఉత్తర ఐర్లండ్‌కు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి ఈ కుక్కను కొనుగోలు చేశాడు. తన ఫాంలో పనికోసం దీన్ని ఉపయోగించుకుంటానని అతడు చెప్పాడట.
ఇంతకుముందు ఇలాంటి జాతికే చెందిన ఓ కుక్కను 2013లో దాదాపు రూ. 10 లక్షలకు వేలం పాడుకున్నారని, ఆ రేటు కంటే ఇది చాలా ఎక్కువని స్కిప్టన్ ఆక్షన్ మార్ట్ ప్రతినిధులు చెప్పారు. అసలు సిసలైన చాంపియన్ షీప్ డాగ్‌లా ఇది పెరిగిందని, అందుకే ఇంత రేటు వచ్చిందని వేలం శాల ప్రతినిధి ఒకరు చెప్పారు. గొర్రెలను కాయడంలో ఇది చాలా పనిమంతురాలని, దీనికి అద్భుతమైన సత్తా ఉందని దాని యజమాని డోహెర్టీ చెప్పారు.