నగరాలకు నయా లుక్..! ఎన్‌ఎంఎస్‌హెచ్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
సాక్షి, అమరావతి: రానున్న ఎనిమిదేళ్లలో దేశంలోని పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చాలని అందుకు అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలో మార్పులు చేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ హబిటాట్–2021–30’ రిపోర్టులో పట్టణ ప్రణాళికలపై పలు ఆసక్తికరమైన వివరాలను పొందుపరిచింది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలోని పట్టణాల్లో నివసించే జనాభా 40% కంటే అధికంగా పెరుగుతుందని.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 75 శాతం పట్టణాల నుంచే వస్తుందని అంచనా వేసింది.
చదవండి: ఇల్లు చూపి ఇల్లాలిని చేసుకునే ఓ ‘పిట్ట’ కథ
ఫలితంగా ఇక్కడి నుంచి వాతావరణానికి హానిచేసే ‘గ్రీన్హౌస్ వాయువులు’ కూడా అధికంగా ఉత్పత్తయ్యే అవకాశముందని, ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు నగర, పట్టణాల మాస్టర్ ప్లాన్లు అవసరమని పేర్కొంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రణాళిక విభాగం ఇప్పటికే ఈ తరహా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధంచేసి, అమలుచేస్తుండడం గమనార్హం. 2,843 నగరాలకే సరైన మాస్టర్ ప్లాన్ దేశంలో జూలై 2019 నాటికి 7,933 నగరాలు, పట్టణాలు ఉండగా, వాటిలో 2,843 వాటికి మాత్రమే చట్టబద్ధమైన మాస్టర్ ప్లాన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లు, లోకల్ ఏరియా ప్లాన్లు, లేఅవుట్ ప్లాన్లు సైతం సక్రమం గాలేవని, చాలా నగరాలు, పట్టణాలకు సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు, ఉన్నవాటిపై కూడా ఏళ్ల తరబడి సమీక్షలు చేయలేదని వివరించింది. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగు ణంగా వసతులు సమకూర్చడం పట్టణ స్థానిక సంస్థలకు కష్టతరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. దీంతోపాటు జనాభా, నివాసాలపై సరైన డేటా లేకపోవడం కూడా మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకంగా మారిందని పేర్కొంది.
వీటిని అధిగమించేందుకు ఆధునిక పద్ధతుల్లో పట్టణ ప్రణాళికలు రూపొందించి అమలుచేసి 2030 నాటికి పూర్తిచేయగలిగితే వాతావరణ మార్పులవల్ల తలెత్తే ఉపద్రవాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని సూచించింది. అందుకోసం పట్టణ ప్రణాళికలకు సంబంధించి పూర్తి భౌగోళిక సమాచారం (జీఐఎస్), రిమోట్ సెన్సింగ్ పద్ధతులను అనుసరించాలని ఆ నివేదిక సూచించింది. దీనిద్వారా ఆయా పట్టణాల్లోని చెరువులు, నీటి కొలనులు, రోడ్లు, కాలువలతో పాటు బహిరంగ ప్రదేశాలను మెరుగ్గా గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఆక్రమణలను గుర్తించి సమర్థంగా అడ్డుకోవచ్చని వివరించింది.
పచ్చదనానికి ప్రాధాన్యం
ఇక పట్టణాలను భయపెడుతున్న వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రాంతాల్లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడు గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించగలమని ‘నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ హబిటాట్–2021–30’ నివేదిక పేర్కొంది. సాధ్యమైనంత మేర గ్రీన్ జోన్లను అభివృద్ధి చేసినట్లయితే మైక్రో క్లైమేట్ నియంత్రణలో ఉంటుందని, అందువల్ల అన్ని నగరాలు తమ సామర్థ్యం మేరకు మార్పులు తీసుకురావాలని సూచించింది. పైగా అత్యవసర పరిస్థితుల్లో సహాయ కార్యకలాపాల కోసం క్విక్ రెస్పాన్స్ మెకానిజాన్ని అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా ఏర్పాట్లుచేసింది.
ముఖ్యంగా అన్ని పట్టణాల్లోను పచ్చదనం అభివృద్ధి చేసేందుకు ‘జగనన్న గ్రీన్‌సిటీ చాలెంజ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి తొలివిడతలో 45 పట్టణాల్లో అమలు చేస్తున్నారు. అలాగే, వరదలవల్ల వచ్చే నష్టాన్ని తగ్గించేందుకు, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు స్పాంజీ సిటీల నిర్మాణానికి సంకల్పించింది. మరోవైపు.. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర పట్టణ సర్వే పూర్తయితే, రాష్ట్రంలోని మొత్తం 123 యూఎల్బీల్లోని జనాభా, నివాసాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, చెరువులు, కాలువలు, రోడ్లతో సహా సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు.
పణాళికలో మార్పులు తప్పదన్న ‘ఎస్సీఎం’
♦మరోవైపు.. ప్రజలకు సౌకర్యవంతమైన స్థిరమైన జీవనం గడిపేందుకు పట్టణ ప్రణాళికలో కీలకమైన పలు మార్పులు అవసరమని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
♦పరిధిలోని ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ సూచించింది. ఇందులో గ్రీన్ కవర్, జీవవైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అలాగే..
♦ఆయా పట్టణాల్లోని ఎకో–సెన్సిటివ్ జోన్లను మ్యాపింగ్ చేయాలని, హాట్స్పాట్లు, నగరంలోని సహజ వనరులు సహా నీటి వనరులు, వాటి పరీవాహక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు వంటి అన్ని రకాల ప్రాం తాలను డిజిటలైజేషన్ చేయాలని సూచించింది.
♦విపత్తులు సంభవించినప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు యూఎల్బీ (అర్బన్ లోకల్‌బాడీలు–పట్టణ స్థానిక సంస్థలు)ల పరిధిలో యంత్రాంగం ఉండాలని తెలిపింది.
♦వరదలు సంభవించినప్పుడు ప్రవాహం పారేందుకు అనువుగా నిర్మాణాలు ఉండాలని.. కాలువలు, చెరువులపై ఆక్రమణలను నిరోధించాలని, సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో పచ్చదనాన్ని అభివృద్ధిచేయాలని సూచించింది.
♦ఇందులో ప్రధానంగా స్థానిక వృక్ష జాతులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. విపత్తుల నివారణకు సరైన ప్రణాళికలు సిద్ధంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న సహజ నీటివనరుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది.
♦అన్ని పట్టణాలు, నగరాల్లో డ్రైనేజీ నెట్‌వర్క్‌ను డిజిటలైజ్ చేసి ఉంచడంతో పాటు డ్రైనేజీ మాస్టర్ ప్లాన్లను సిద్ధంచేసుకోవాలని సూచించింది.
♦అంతేగాక.. నగర విస్తీర్ణంలో 10–12 శాతంవాటర్ బాడీలను వినోద కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అర్బన్ అండ్ రీజినల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ గైడ్‌లెన్స్‌ను అమలుచేయాలని సూచించింది.
♦మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్న పరిశ్రమల చుట్టూ గ్రీన్‌బెల్ట్ బఫర్ జోన్లను అభివృద్ధి చేయాలి.
♦పట్టణ మాస్టర్ ప్లాన్‌లో నీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు ప్రవాహాలకు ప్రత్యేక నెట్వర్క్ ఉండాలని సూచించింది.