రెండోవిడత 13 స్మార్ట్ సిటీల జాబితా విడుదల
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల రెండో జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్‌కు చోటు దక్కింది. 13 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల రెండో జాబితాను మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో లక్నో తొలి స్థానంలో నిలవగా, వరంగల్ 9వ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..స్మార్ట్ సిటీస్ పథకానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. వంద ఆకర్షణీయమైన నగరాల్లో భాగంగా ఇప్పటికే 98 నగరాలను గుర్తించామన్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అనే నినాదం ఉండేదని, ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నినాదం చేపడుతున్నామన్నారు. కాగా తొలి విడత స్మార్ట్ సిటీల జాబితాలో ఒక్క పాయింట్ తేడాతో వరంగల్ అవకాశాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.
రెండో జాబితాలోని స్మార్ట్ సిటీలు
1. లక్నో (ఉత్తరప్రదేశ్)
2. భగల్పూర్ (బిహార్)
3. న్యూ టౌన్, కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)
4. ఫరీదాబాద్ (హర్యానా)
5.ఛంఢీఘర్
6.రాయ్‌పూర్ (ఛత్తీస్ఘర్)
7.రాంచీ (జార్ఖండ్)
8.ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్)
9. వరంగల్ (తెలంగాణ)
10. పనాజీ (గోవా)
11. అగర్తలా (త్రిపుర)
12. ఇంపాల్ (మణిపూర్)
13. ఫోర్ట్ బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవులు)