స్మార్ట్‌గా సరుకు షిఫ్ట్...
♦ క్లిక్ దూరంలో చిన్న వాణిజ్య వాహనాలు
♦ సరుకు రవాణా ఇక మరింత సులువు
♦ సాక్షితో స్మార్ట్‌షిఫ్ట్ సీఈవో కౌసల్య
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చిన్న వాణిజ్య వాహనం అద్దెకు కావాలంటే సమీపంలో ఉన్న అడ్డాకు వెళ్లాల్సిందే. డ్రైవర్ చెప్పిన రేటుకు ఓకే చెప్పాల్సిన పరిస్థితి. లేదా మరో వాహనాన్ని వెతుక్కోవాలి. సొంత వెహికల్ లేని చిన్న వ్యాపారులకు ఇది అతిపెద్ద సమస్య. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఎస్ఎంఈలను, ట్రాన్స్పోర్టర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్మార్ట్‌షిఫ్ట్. సరుకు రవాణాకు చిన్న వాణిజ్య వాహనం కావాల్సి వస్తే స్మార్ట్‌ఫోన్‌లో ఒక క్లిక్ చేస్తే చాలు. నిమిషాల్లో వాహనం ప్రత్యక్షమవుతుంది. ఇక రవాణా చార్జీ అంటారా.. ఎంచక్కా డ్రైవర్‌తో బేరమాడుకోవచ్చు. వెహికల్‌ను ట్రాక్ చేయవచ్చు కూడా. అటు వాహన యజమానులకూ అదనపు వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతున్నామని స్మార్ట్‌షిఫ్ట్ సీఈవో కౌసల్య నందకుమార్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు.
స్మార్ట్‌షిఫ్ట్ ఇలా పనిచేస్తుంది..
వ్యాపారులు ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో స్మార్ట్‌షిఫ్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. సరుకును ఎక్కడికి రవాణా చేయాలో నిర్దేశించాలి. సరుకు రకం, దూరం, వాహనం మోడల్‌నుబట్టి చార్జీ ఎంతనో స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంతకంటే తక్కువ చార్జీకే వాహనం కావాలంటే.. వ్యాపారి తనకు నచ్చిన ధరను కోట్ చేయవచ్చు. ఈ వివరాలతో వ్యాపారి ఉండే ప్రదేశానికి సమీపంలో ఉన్న 10 మంది డ్రైవర్లకు సందేశం వెళ్తుంది. డ్రైవర్ల వద్ద బేసిక్ ఫోన్ ఉన్నా ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో సమాచారం చేరవేస్తారు.
చార్జీ నచ్చితే డ్రైవర్ ఓకే చెప్పొచ్చు. లేదా ఎక్కువ చార్జీ డిమాండ్ చేయవచ్చు. ఇరువురికీ ఆమోదయోగ్యం అయితే డీల్ కుదురుతుంది. ఇందుకు డ్రైవర్ల నుంచి కొంత కమీషన్‌ను కంపెనీ వసూలు చేస్తుంది. హైదరాబాద్‌తోపాటు ముంబైలో సేవలందిస్తున్న స్మార్ట్‌షిఫ్ట్‌కు 3,000 మందికిపైగా వ్యాపారులు కస్టమర్లుగా ఉన్నారు. 1,200 మందికిపైగా వాహనాలు నమోదయ్యాయి.
డ్రైవర్లకు అదనపు ఆదాయం..: రవాణాకు ఎక్కువ ధర చెల్లిస్తున్న వ్యాపారులూ ఉన్నారు. డిమాండ్ ఎక్కడ ఉందో తెలియక వాహనాలు ఖాళీగా ఉండే సందర్భాలూ ఉన్నాయి. వ్యాపారులను, వాహన యజమానులను ఒకే వేదికపైకి తీసుకురావడమే మా పని అని కౌసల్య నందకుమార్ తెలిపారు. రవాణా చార్జీలు ఇరువురికీ ఆమోదయోగ్యంగా ఉండడం తమ సేవల ప్రత్యేకత అని ఆమె వివరించారు. ‘వాహన యజమానుల ఆదాయం గణనీయంగా పెరిగింది. సరుకు రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నాం. లెండింగ్‌కార్ట్ ద్వారా వ్యాపారులకు రుణం ఇప్పిస్తున్నాం’ అని తెలిపారు. మహీంద్రా గ్రూప్ స్మార్ట్‌షిఫ్ట్ సీడ్ ఇన్వెస్టర్‌గా ఉందని చెప్పారు. కంపెనీ విస్తరణకు గ్రూప్ పూర్తి సహకారం అందిస్తోందన్నారు.