అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని సెప్టెంబర్ 15న చేపట్టనున్న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని సామాజిక హక్కుల వేదిక నిర్ణయించింది. స్థానిక ఎస్ఎస్ ప్యారడైజ్‌లో బుధవారం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక కన్వీనర్ జగదీష్ అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించి ఉద్యోగ నియామకాల్లో 13 జిల్లాల యువతకు అవకాశం కల్పించాలని కోరారు. సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. బీసీ సంఘం నేతలు రాగే పరశురామ్, ఓబయ్య, మైనార్టీ నాయకులు సాలార్‌బాష, నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.