South 24 Parganas district
-
సర్కారు ఎవరిదో నిర్ణయించేది ఆ రెండు జిల్లాలే!
కోల్‌కతా: నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ.. పశ్చిమబెంగాల్లో ఈ రెండు జిల్లాలు తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటలు. ఈ కోటలను బద్దలు కొట్టి టీఎంసీ ఓటమికి బాటలు వేయాలనేది బీజేపీ ప్రణాళిక. ఈ రెండు జిల్లాల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుపొందడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలన్నది టీఎంసీ ఆలోచన. మొత్తం 294 స్థానాల అసెంబ్లీలో ఈ రెండు జిల్లాలకు కలిపి 64 సీట్లు ఉన్నాయి. నార్త్ 24 పరగణలో 33, సౌత్ 24 పరగణలో 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్ 24 పరగణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు జిల్లాలకు బంగ్లాదేశ్‌తో సరిహద్దులున్నాయి. శరణార్థుల జనాభా కూడా ఇక్కడ ఎక్కువ. 1980లో 24 పరగణ జిల్లాను అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం రెండు జిల్లాలుగా విభజించింది. మొదట్లో ఈ ప్రాంతంలో వామపక్షాలకు గట్టి పట్టు ఉన్నప్పటికీ క్రమంగా టీఎంసీ పుంజుకుని, లెఫ్ట్ బలాన్ని తగ్గించేసింది. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాలు ఈ ప్రాంతంలో టీంఎసీని మరింత బలోపేతం చేశాయి. 2011, 2016 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2016లో నార్త్ పరగణలో 27, సౌత్ పరగణలో 29 స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో నార్త్ పరగణలో బీజేపీ కొంతవరకు ప్రభావం చూపగలిగింది. ‘బెదిరింపులతో, ప్రలోభాలతో 2019 ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావం చూపింది. కానీ ఆ తరువాత మేం జాగ్రత్తపడ్డాం. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకున్నాం’ అని నార్త్ 24 పరగణ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు జ్యోతిప్రియొ తెలిపారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విబేధాలు, మత ఘర్షణల కారణంగా రెండు జిల్లాల్లోనూ టీఎంసీ బలం కొంత తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచారాస్త్రంగా చేపట్టి, శరణార్ధులను ఆకర్షించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో రెండింటిని బీజేపీ గెల్చుకోగలిగింది. అలాగే, అక్కడ ప్రబలంగా ఉన్న మథువా వర్గంలో పట్టు సాధించింది. నార్త్ 24 పరగణలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మథువాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ రెండు జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు బీజేపీలో చేరడం టీఎంసీకి ఆందోళనకరంగా మారింది. కొత్తగా వచ్చిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సౌత్ 24 పరగణ జిల్లాలో టీఎంసీకి చెందిన మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐఎస్ఎఫ్ కాంగ్రెస్, లెఫ్ట్‌లతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ప్రచారం సాయంతో నార్త్ 24 పరగణలో 60% సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ధీమాగా ఉన్నారు. -
విషాదం: పోలింగ్ కేంద్రంలో జవాన్ ఆత్మహత్య
కోల్కత్తా: ఎన్నికలకు అంతా సిద్ధమైంది.. కొద్దిసేపయితే పోలింగ్ ప్రారంభం అవ్వాల్సిన సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ జవాన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఎన్నికలకు అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో రెండో దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని పాతర్ ప్రతిమ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఆ కేంద్రంలో బందోబస్తు నిర్వహించేందుకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన కమల్‌గంగూలీ బుధవారం వచ్చాడు. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారేసరికి విగతజీవిగా మారాడు. ఆ పోలింగ్ కేంద్రంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఒకవైపు ఎన్నికలు ఉన్నాయి.. ఇక్కడేమో మృతదేహం అని కంగారు పడ్డారు. వెంటనే మృతదేహాన్ని దించి పోస్టుమార్టం తరలించారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో మొత్తం సర్దుబాటు చేసి ఏర్పాట్లు పునరుద్ధరించారు. అయితే జవాన్ గంగూలీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
‘నన్ను చంపేస్తారు.. అందుకే విగ్రహాలు చేయించా’
కోల్‌కతా : చంపేస్తారనే భయంతో తన విగ్రహాలను తయారు చేయించిపెట్టుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్. తాను చనిపోయిన తర్వాత ప్రజలు తనను మర్చిపోవద్దనే ఉద్దేశంతో విగ్రహాలను తయారు చేయించానని చెబుతున్నారు. సౌత్ 24 పర్గానాస్ జిల్లాలోని గోసాబా నియోజవర్గ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్(71) మూడేళ్ల క్రితం కోల్‌కతాలో పేరుగాంచిన శిల్పితో రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నారు. ఫైబర్ గ్లాస్‌తో తయారు చేయించిన ఈ విగ్రహాలను తన ఇంట్లో భద్రంగా దాచుకున్నారు. అయితే ఇటీవల తన నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విగ్రహాల విషయం బహిర్గతమైంది. ఈ విగ్రహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. తనకు ప్రాణహాని ఉందని, తాను హత్యకు గురై చనిపోతే.. ప్రజలను మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను తయారు చేయించానని చెప్పుకొచ్చారు. ‘గతంలో నలుగురు హంతకులు అలిపోర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు మళ్లీ పట్టుబట్టారు. వారిని విచారించగా.. నన్ను చంపేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లోకల్ లీడర్లే నన్ను హత్య చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నాకు జిల్లా ఎస్పీ ప్రవీణ్ త్రిపతి చెప్పారు. దీంతో నాకు ‘వై’ కేటగిరి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాకు ప్రాణహాని ఉంది. ఏ క్షణంలోనైనా నేను హత్యకు గురికావొచ్చు. నేను చనిపోయిన తర్వాత ప్రజలు నన్ను మర్చిపోవద్దు. అందుకే విగ్రహాలు తయారు చేయించా‘ అని ఎమ్మెల్యే నాస్కర్ అన్నారు. తనకు టీఎంసీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారని, వారంతం ఇంతకు ముందు ఇతర పార్టీలో ఉండేవారని చెప్పుకొచ్చారు. జయంత్‌కు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం. -
తృణమాల్ నాయకుడి కాల్చివేత
కోల్కత్తా: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడుని దుండగులు కాల్చి చంపారు. ఇటీవల టీఎంసీ ఎమ్మెల్యేను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటన మరవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన టీఎంసీ నాయకుడు కార్తీక్ నస్కర్‌ను దుండగులు అతి దగ్గర నుంచి కాల్చిచంపారు. కార్తీక్ భార్య స్వప్న నస్కర్ దారియా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నారు. కార్తీక్ టాంగ్రఖలి నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత అతన్ని అడ్డగించిన కొందరు వ్యక్తులు పదుననైన ఆయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత అతన్ని కాల్చివేశారు. అక్కడున్నవారు ఆస్పత్రి తరలించేలోపే కార్తీక్ మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆదివారం సాయంత్రం కుల్తూలికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. -
ఫేస్బుక్లైవ్లో..యువతి ఆత్మహత్య
కోల్‌కతా : ఫేస్బుక్లో లైవ్ పెట్టి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని సోనపూర్లకు చెందిన 18 ఏళ్ల యువతి తల్లి దండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. యువతి తల్లి దగ్గరలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. గత శని వారం సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వచ్చిన యువతి విచారంగా ఇంట్లోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు తల్లి డ్యూటీకి వెళ్లింది. ఆ సమయంలో యువతి తండ్రి, సోదరుడు కూడా పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న యువతి శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆదివారం ఉదయం తల్లి ఇంటి వచ్చి తలుపులు తట్టినా తెరవకపోవడంతో కిటికిలోనుంచి తొంగి చూసి, విగత జీవిగా ఉన్న కూతురుని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆ యువతి మొబైల్ చూడగా ఫేస్బుక్ లైవ్‌లో ఓ యువకుడితో మాట్లాడినట్లు ఉందని, అతను ఆమె ప్రియుడు కావొచ్చని పోలీసులు తెలిపారు. కాగా తన కూతురు శనివారం సాయంత్రం విచారంగా ఇంటికి వచ్చిందని, దిగులుగా గదిలోకి వెళ్లిందని యువతి తల్లి పేర్కొన్నారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టంకి తరలించి విచారణ చేపట్టారు. -
రూపా గంగూలీపై దాడి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకురాలు రూపా గంగూలీపై గర్తు తెలియని దుండగులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని కాక్ డ్విప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈశ్వరిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బీజేపీ కార్యకర్తను పరామర్శించి కాక్ డ్విప్ నుంచి తిరిగొస్తుండగా దుండగులు ఆమెపై దాడి చేశారు. టీఎంసీ మద్దతుదారుల దాడిలో గాయపడి కాక్ డ్విప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తను పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా కొంతమంది గామస్తులు ఆమె కారును అడ్డుకున్నారు. ఆమెపై చేయి చేసుకున్నారు. ఆమె కారు కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రూపా గంగూలీ తలకు గాయం కావడంతో ఆమెను డైమండ్ హార్బర్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక టీఎంసీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. దాడికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనా స్థలానికి భారీగా పోలీసులను తరలించారు.